తెలంగాణ జడ్జిలను వేరే రాష్ట్రాలకు పంపొద్దు

తెలంగాణ జడ్జిలను  వేరే రాష్ట్రాలకు పంపొద్దు
  •     ఇతర రాష్ట్రాల జడ్జిలను ఇక్కడికి తేవద్దు  
  •     సుప్రీంకోర్టు, కేంద్ర న్యాయశాఖకు హైకోర్టు అడ్వకేట్ల విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు నుంచి జడ్జిలను ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల జడ్జిలను ఇక్కడికి బదిలీ చేస్తుండటంపై హైకోర్టు అడ్వకేట్లు మండిపడ్డారు. రాష్ట్ర జ్యుడీషియరీని కాపాడాలంటూ బుధవారం లంచ్ అవర్ లో హైకోర్టు ముందు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. ఇకపై రాష్ట్ర హైకోర్టు జడ్జిలను వేరే రాష్ట్రాలకు బదిలీ చేయొద్దని, వేరే రాష్ట్రాల జడ్జిలను తెచ్చి ఇక్కడ నియమించవద్దని సుప్రీంకోర్టుకు, కేంద్ర న్యాయ శాఖకు విజ్ఞప్తి చేశారు. ‘‘గతంలో తెలంగాణ హైకోర్టు జడ్జిలు ముగ్గుర్ని పంజాబ్, త్రిపుర హైకోర్టులకు బదిలీ చేశారు. ఇటీవల ఏపీకి చెందిన ఓ జడ్జిని ఇక్కడికి బదిలీ చేశారు. మరికొందరు తెలంగాణ జడ్జిలను ఇతర రాష్ట్ర హైకోర్టులకు పంపారు. ఇప్పుడు వాళ్ల స్థానంలో ఏపీ హైకోర్టు జడ్జిల్ని తెచ్చి నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆరోపించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో న్యాయవాదులకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీనియర్ అడ్వకేట్ సరసాని సత్యం రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల జడ్జిలకు ఇక్కడి పరిస్థితులు తెలియనందున ప్రజలకు సరైన న్యాయం జరగదన్నారు. తెలంగాణ న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని మంటగలిపే చర్యల్ని సహించబోమని, లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని న్యాయవాది నరేశ్ రెడ్డి హెచ్చరించారు.  ఈ నిరసన కార్యక్రమంలో అడ్వకేట్లు ఎ. జగన్, చిక్కుడు ప్రభాకర్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ సత్య నారాయణ, జి.సంజీవ్, రాజేష్ రెడ్డి, రాజేష్ నెహతా పాల్గొన్నారు.