ఉచితాలిస్తే జనం సోమరులైతరు..ఫ్రీగా రేషన్, డబ్బులు వస్తే పనెందుకు చేస్తరు?

ఉచితాలిస్తే జనం సోమరులైతరు..ఫ్రీగా రేషన్, డబ్బులు వస్తే పనెందుకు చేస్తరు?
  • సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • ప్రజలను మనమే పరాన్నజీవులను చేస్తున్నామా?అని ప్రశ్న 

న్యూఢిల్లీ: ఎన్నికల ముంగట రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాలతో ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించింది.  ఫ్రీగా రేషన్, డబ్బులు వస్తున్నప్పుడు.. వాళ్లు ఇక పని ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్​తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉచిత పథకాలను ప్రస్తావించిన బెంచ్.. వాటి వల్ల జరిగే అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘దురదృష్టవశాత్తు.. లాడ్కీ బహిన్ లాంటి ఉచిత పథకాల కారణంగా ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరు. దేశాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాల్సిందిపోయి.. మనమే వాళ్లను సోమరిపోతులుగా తయారు చేస్తున్నామా?” అని ప్రశ్నించింది. ప్రజలు ఎలాంటి పని చేయకున్నా.. వాళ్లకు ఫ్రీగా రేషన్, డబ్బులు అందుతున్నాయని పేర్కొంది. కాగా, లాడ్కీ బహిన్ స్కీమ్ మహారాష్ట్రలో అమలవుతున్నది. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందుతున్నది. 

వ్యవసాయ కూలీలు దొరకట్లేదు.. 

పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘నిరాశ్రయులపై మీకున్న శ్రద్ధకు మిమ్మల్ని అభినందిస్తున్నం. కానీ వాళ్లను సమాజ స్రవంతిలో భాగం చేసి, దేశాభివృద్ధికి తోడ్పాటును అందించేలా అనుమతించడం మంచిది కాదంటారా?” అని ప్రశ్నించారు. దీనికి ప్రశాంత్ భూషణ్ సమాధానమిస్తూ.. చేసేందుకు పని దొరికినంక, చేయకూడదని అనుకునేవాళ్లు దేశంలో ఎవరూ ఉండరని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘మీకు నాణేనికి ఒకవైపు మాత్రమే తెలుసు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముంగట ప్రకటించే ఇలాంటి ఉచిత పథకాల వల్ల.. వ్యవసాయదారులకు కూలీలు దొరకడం లేదు” అని తెలిపారు. 

పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలేంటి? 

కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. పట్టణాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మిషన్ ను ప్రారంభించనుందని తెలిపారు. పట్టణాల్లోని నిరాశ్రయులకు షెల్టర్ కల్పించడం తదితర ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. ‘‘ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అందులో ఏమేం ఉంటాయి? అనేది కేంద్రాన్ని అడిగి నివేదిక సమర్పించండి. అలాగే ఆ స్కీమ్ అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతమున్న నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్స్ మిషన్ కొనసాగుతుందా? అనేది కూడా తెలియజేయండి” అని అటార్నీ జనరల్ ను ఆదేశించింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. 

ఉచితాలపై విచారణకు ఢిల్లీ హైకోర్టు నో.. 

ఉచితాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇదే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారరిస్తుండటంతో అక్కడికి వెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెల బుధవారం విచారణ చేపట్టారు.

రాజకీయ ప్రసంగాలొద్దు.. 

విచారణ సందర్భంగా పిటిషనర్లలో ఒకరు మాట్లాడుతూ.. నిరాశ్రయులను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలకు ధనికులపై ఉన్న ప్రేమ.. పేదలపై లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇదేం రామ్ లీలా మైదానం కాదు. ఇక్కడ రాజకీయ ప్రసంగాలు చేయొద్దు. అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదు. మేం మా కోర్టు రూమ్స్ ను రాజకీయ యుద్ధ భూమిగా మార్చేందుకు అనుమతించం” అని జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.