
- విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం
- ఆ 400 ఎకరాల్లో మీరేం చేస్తారో మాకవసరం లేదు
- 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంపైనే మా ఆందోళన
- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
- పర్యావరణ అనుమతులు పాటించనట్లు తేలితే
- సీఎస్, అధికారులంతా జైలుకు వెళ్తారని హెచ్చరిక
- తొలగించిన చెట్లు పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
- అప్పటిదాకా స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడి
- సీఈసీ రిపోర్ట్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడువు
- తదుపరి విచారణ మే 15కు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ అనుమతులు పాటించనట్లు తేలితే సీఎస్, అధికారులంతా జైలుకు వెళ్తారని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ‘‘ఆ స్థలంలో ఐటీ పార్కు తెస్తారో, ఏఐ పార్కు తెస్తారో మాకవసరం లేదు. ఆ భూములను మార్టిగేజ్ చేస్తారో, అమ్ముకుంటారో మీ ఇష్టం.. కానీ డజన్ బుల్డోజర్లతో 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంపైనే మా ఆందోళన’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తొలగించిన చెట్లను పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతోపాటు బీ ఫర్ ది చేంజ్ సొసైటీ, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లపై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ఫర్ ది ఛేంజ్ సొసైటీ పిటిషన్ తరుఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్ తరఫున ఎస్.నిరంజన్ రెడ్డి, భారత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కాగా, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) రిపోర్ట్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను మే 15 కు వాయిదా వేసింది. అప్పటిదాకా 400 ఎకరాల భూమిలో స్టేటస్కో కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
కోర్టు ఆదేశాలతో పనులు ఆపేశాం: సింఘ్వీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. గత ఆదేశాల నేపథ్యంలో అన్ని పనులు ఆపివేశామని కోర్టుకు నివేదించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. అయితే.. ఫేక్ వీడియోలతో కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. మినహాయింపులకు లోబడే కొన్ని చెట్లను తొలగించినట్లు వెల్లడించారు. మధ్యలో జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టంగా చెప్పాలన్నారు. ఇందుకు ‘అవును, అనుమతులు తీసుకున్నాం’ అని సింఘ్వీ బదులిచ్చారు. 1300 చెట్లకు మినహాయింపు ఇచ్చామని, ఇందుకు సెల్ప్ సర్టిఫికేషన్, ఇతర నిబంధనలు పాటించినట్లు తెలిపారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించామన్నారు. మరోసారి జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకొని.. పర్యావరణానికి సంబంధించి 1996 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఫాలో అయ్యారా? అని ప్రశ్నించారు. ఈ 100 ఎకరాల్లో పునరుద్ధరణ ఎలా చేస్తారు? ఎంత కాలంలో చేస్తారు? జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారు? అనేది స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర సర్కారును ఆదేశించారు.
20 ఏండ్లుగా మహారాష్ట్ర పోరాడుతున్నది: అమికస్‌క్యూరీ
మరోవైపు అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని.. తెలంగాణలో వాల్టా(వాటర్ అండ్ ట్రీ) యాక్ట్ అమల్లో ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ చట్టాలను చూపి.. ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికెట్‌ను తీసుకుందన్నారు. కానీ.. సెక్షన్ 40 ప్రకారం కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని వాదించారు. ఇది పూర్తిగా చట్టాలకు విరుద్ధమని తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకొని.. ప్రజా ఉపయోగం, పవర్ గ్రీన్డ్, మెట్రో రైల్ కోసం చర్యలు చేపట్టవచ్చన్నారు. మెట్రో కోసం అయితే పోరాటం చేయాలని సూచించారు. పర్యావరణానికి సంబంధించి కొన్ని అడ్డంకుల వల్ల మహారాష్ట్ర హైకోర్టు, నాగ్ పూర్ లో సెక్రటేరియట్ బిల్డింగ్ ల కేసుపై దాదాపు 20 ఏండ్లుగా ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతున్నదన్నారు. తుది విచారణలో ఫైనల్ గా ఏ తీర్పు వస్తుందో తాము చెప్పలేమన్నారు.
హైదరాబాద్ లో ఏనుగులా?: సింఘ్వీ
బుల్డోజర్లు, జంతువులపై వీధి కుక్కల దాడి వీడియోలు ఆందోళన కలిగించాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందుకు సింఘ్వీ బదులిస్తూ.. హైదరాబాద్ లో ఏనుగులు అని ఫేక్ వీడియోలు చూపించారన్నారు. అసలు హైదరాబాద్ లో ఏనుగులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. వాల్టా రూల్స్ ను పరిగణనలోకి తీసుకున్నామని కోర్టుకు నివేదించారు. ఈ రూల్స్ 1996 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుబంధంగా ఉన్నాయా? అని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టుకు ఏ గవర్నమెంట్, బీ గవర్నెంట్ అనేది అవసరం లేదని పేర్కొంది. ‘ఈ విషయంలో మేం బ్యూరోక్రాట్స్, మంత్రుల వివరణ ప్రకారం వెళ్లం. 1996 సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలా అధిగమించిందో రాష్ట్రం సమర్థించుకోవాలి’ అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు 1996 తీర్పును అతిక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే.. సీఎస్ తోసహా అధికారులు చెట్లు నరికిన ప్రాంతంలోనే తాత్కాలిక జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించింది.
మార్టిగేజ్ అంశం మాకనవసరం: బెంచ్
అమికస్ క్యూరీ మరోసారి వాదిస్తూ.. రూ. 10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందన్నారు. అయితే ఈ అంశాన్ని సీఎస్ తన అఫిడవిట్ లో దాచిపెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టినా.. ఈ భూములను వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పజెప్పాలని కోరారు. గత నెల 24 న మార్టిగేజ్ చేశారని, 28 న 100 ఎకరాల్లో చెట్ల నరికివేతను ప్రారంభించారని కోర్టుకు చెప్పారు. ఈ వాదనలను తోసిపుచ్చిన కోర్టు... ‘ఆ భూములను మార్టిగేజ్ చేశారా? అమ్ముకున్నారా?’ అనేది తమకు అనవసరమని వ్యాఖ్యానించింది. చెట్లు కొట్టివేసే ముందు పర్మిషన్ తీసుకున్నారా? లేదా? అనేది మాత్రమే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొని.. హెచ్ సీయూకు 2,500 ఎకరాల భూమి ఉందని, ఇందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతున్నదని, దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, ఈ 20 ఏండ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి, ఐటీ పార్కులు, ఏఐఏ, ఇతర అంశాలను వివరించేందుకు ప్రయత్నించారు. దీనిపై మరోసారి స్పందించిన ధర్మాసనం.. డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ పేరుతో పర్యావరణ విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించబోమని సీరియస్ అయ్యింది. ఆ స్థలంలో ఏఐఏ, ఎనిథింగ్ ఎల్స్ వస్తుందనేది తమకు అవసరం లేదని వ్యాఖ్యానించింది. కేవలం ‘డజన్ బుల్డోజర్స్ తో 100 ఎకరాల్లో చెట్ల నరికివేతే మా ఆందోళన’ అని కామెంట్ చేసింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది.
అది సింఘ్వీ చాయిస్: బెంచ్
మరో సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంద ఎకరాల్లో జంతువులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని వివరించారు. సీఎస్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. వంద ఎకరాలు మార్టిగేజ్ చేసి, చెట్లు కొట్టేసి ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటీ పార్కు అని చెబుతున్నారని అన్నారు. 100 ఎకరాల అడవిని నరికేయడం వల్ల వన్య ప్రాణులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని చెప్పారు. వీధి కుక్కలు వీటిని వేటాడే ప్రమాదం ఉందన్నారు. జంతువుల రక్షణ, నీటి సరఫరా పై వైల్డ్ లైఫ్ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘వీధి కుక్కల దాడిలో ఆశ్రయం కోసం పరిగెడుతున్న వన్యప్రాణుల వీడియోలు చూసి ఆశ్చర్య పోయాం. ముంబైలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, జైపూర్ లో ఆల్వా, చెన్నై లో గిండి లేదా గిడి, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో గ్రీనరీ పార్క్ లను కాపాడుకోలేకపోతే ఎలా? ” అని ప్రశ్నించారు. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలని వ్యాఖ్యానించారు. ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘ఇదంతా సింఘ్వీ చాయిస్. అధికారులు చెట్లు నరికిన ప్రాంతంలో నిర్మించే జైళ్ల లో కనీసం ఆరు నెలలు ఎంజాయ్ చేయవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వ వైల్డ్ లైఫ్ వార్డనర్స్ వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సూపర్ వైజ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వ అడ్వకేట్ సింఘ్వీ అంగీకారం తెలిపారు. అయితే, సీఈసీ రిపోర్ట్ తో పాటు ఇంకా అనేక అంశాలపై సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.‘సీఈసీ రిపోర్ట్ చాలా పెద్దగా ఉంది. దానికి సమాధానం ఇచ్చేందుకు టైం కావాలి’ అని బెంచ్‌ను కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఉన్నతాధికారులను కాపాడుకోవాలంటే ప్లాన్‌తో రండి: సుప్రీం బెంచ్
సీఎస్, ఉన్నతాధికారులు జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలంటే.. నష్టం జరిగిన 100 ఎకరాల్లో చేపట్టబోయే పునరుద్ధరణ ప్రణాళికతో రావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని హెచ్చరించింది. ‘‘చీఫ్ సెక్రటరీ ఒక మహిళ, ఆమె నెలలో రిటైర్ అవుతున్నారు. కేవలం కో–ఆర్డినేటర్ గా మాత్రమే వ్యవహరించారు’ అని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. 2024 మార్చి నుంచి కొనసాగుతున్నారని నివేదించారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అందుకే స్పాట్ లోకి పెద్ద సంఖ్యలో బుల్డోజర్లు వెళ్లాయా?. ఇది ఆశ్చర్యకరంగా ఉంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మార్చిలో 3 రోజులు సెలవు కావడంతో చెట్లను తొలగించేందుకు బుల్డోజర్లు తెచ్చారని, చెట్ల నరికివేతకు ఇంత అర్జెన్సీ ఏముందని ప్రశ్నించింది. ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నప్పుడు బాధ్యత వహించాలని బెంచ్ పేర్కొన్నది. దేశ సరిహద్దుల మీదుగా సాగే చార్ ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే అనుమతించలేదని చెప్పింది. ఇరు దేశాల మధ్య వార్ సమయంలో ఈ రోడ్ కీలకమని కేంద్రం ఏండ్లుగా పోరాటం చేస్తున్నా అనుమతించలేదని బెంచ్ గుర్తు చేసింది.