
- పరిష్కారం కోసం బలమైన యంత్రాంగం కావాలి
- వేముల రోహిత్ కేసు విచారణలో సుప్రీంకోర్టు కామెంట్స్
న్యూఢిల్లీ, వెలుగు: ఉన్నత విద్యాసంస్థలలో ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు బెంచ్ కామెంట్ చేసింది. విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని తెలిస్తే ప్రతి ఒక్కరూ ఇలానే ఫీల్ అవుతారని పేర్కొంది. ఈ సమస్యను నిజంగా పరిష్కరించే బలమైన, దృఢమైన యంత్రాంగాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. కళాశాలల్లో కులవివక్షపై(క్యాస్ట్ డిస్క్రిమినేషన్) వచ్చిన ఫిర్యాదులను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ముసాయిదా నిబంధనలను సిద్దంచేసినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది.
కళాశాలల్లో కులవివక్షను నిర్మూలించేందుకు తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, ముంబైలో ఆదివాసీ విద్యార్థిని పాయల్ తాడ్వి తల్లి అబేద సలీం తాడ్వి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్ తో కూడిన బెంచ్ విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైనంగ్, దిశా వాడేకర్ వాదనలు వినిపించారు. విద్యాసంస్థలలో కుల వివక్షను నిర్మూలించేలా రూల్స్ ను అమలు చేయడంలో యూజీసీ విఫలమైందని కోర్టుకు నివేదించారు. కులాల వారీగా విద్యార్థుల ఆత్మహత్యలపై డేటాను ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
2004–2024 మధ్య ఉన్నత విద్యాసంస్థలు ఐఐటీల్లో 115 ఆత్మహత్యలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఆత్మహత్యల సమస్యను పరిష్కరించే దిశలో ముసాయిదాలో కొన్ని నిబంధనలను సిద్దంచేసినట్లు బెంచ్ కు తెలిపారు. దీనిపై జోక్యం చేసుకొన్న బెంచ్.. ముసాయిదా నిబంధనలను యూజీసీ వెబ్‌సైట్‌లో పెట్టి, అన్ని వర్గాల నుంచి సూచనలను ఆహ్వానించాలని స్పష్టంచేసింది. జస్టిస్ కాంత్ స్పందిస్తూ.. "ఉన్నత విద్యాసంస్థలలో ఆత్మహత్యల సమస్య దురదృష్టకరం. మనలో ప్రతి ఒక్కరికీ అలాగే అనిపిస్తుంది. అందువల్ల ఈ సమస్యను నిజంగా పరిష్కరించగల బలమైన, దృఢమైన యంత్రాంగాన్ని సృష్టించేందుకే మేం చూస్తున్నాము" అని అన్నారు. తదుపరి విచారణను మే కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.