- ప్రజాప్రతినిధులు, జడ్జిలు, జర్నలిస్టులకు ఉమ్మడి ఏపీలో భూ కేటాయింపు
- దీన్ని 2010లోనే కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
- తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం, సొసైటీలు
- సుదీర్ఘ వాదనల తర్వాత తుది తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం
- డబ్బులను తిరిగి సొసైటీలకు వడ్డీతో ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
- జర్నలిస్టుల మేలు కోసం అప్పట్లో జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన ఉత్తర్వులూ క్యాన్సిల్
న్యూఢిల్లీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు చేసిన భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు, ఆఫీసర్లు, జర్నలిస్టుల సొసైటీలకు భూములు కేటాయిస్తూ ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం జారీచేసిన జీవోలను కొట్టివేసింది. కొన్ని వర్గాలకు మాత్రమే భూములు కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ను ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. ఆయా సొసైటీలకు డబ్బులను తిరిగి వడ్డీతో పాటు ఇచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.వడ్డీ రేటును రాష్ట్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్తంగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు సూచించింది.
2010 నుంచి కేసు
2008లో ఆనాటి ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు భూకేటాయింపులకు సంబంధించి 419, 420, 422, 425, 551 జీవో లు రిలీజ్ చేసింది. అయితే సమాజంలో కొన్ని వర్గాలవారికి మాత్రమే బేసిక్ రేట్లతో స్థలాలు కేటాయించేలా ఈ జీవోలు ఉన్నాయని డా. రావు, వీబీజే చెలికాని, ప్రజా సంఘాలు ఆనాటి ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై 2010లోనే హైకోర్టు విచారణ జరిపి.. ప్రభుత్వ జీవోలను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, సొసైటీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అప్పటి నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతున్నది. అయితే, 2022లో అప్పటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ... రాజకీయ నాయకులు, జడ్జీలు, ఇతరులకు గ్రేటర్ హైదరాబాద్పరిధిలో భూకేటాయింపులను నిషేధించాలని వాదించారు. సుదీర్ఘ వాదనల తర్వాత.. ఈ పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.
జర్నలిస్టుల కోసం జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన ఉత్తర్వులూ రద్దు
మొత్తం 64 పేజీల తీర్పు కాపీలో సుప్రీంకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రతివాది కేశవ్ రావు యాదవ్ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్ట్ ల సొసైటీలకు హౌసింగ్ కోసం ఇచ్చిన భూకేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పిటిషన్ లో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన అన్ని మధ్యంతర ఉత్తర్వులు ప్రస్తుత తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో జర్నలిస్టుల వరకు మేలు చేసేలా గతంలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు కానున్నాయి. ఈ తుది తీర్పును వెలువరించడంలో తాము సముచితంగా భావిస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది. సొసైటీ సభ్యులకు... స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ తో సహా వారు చెల్లించిన డిపాజిట్ అమౌంట్ ను వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే దేశ అభివృద్ధికోసం పాటుపడే (స్పోర్ట్స్, ఎమినెంట్ పర్సనాలిటీ) వారికి స్థలాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి అబ్జర్వేషన్లు చేసింది. ఫైనల్ గా ఈ కేసులో ఇప్పటి వరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
స్థల పత్రాలు సీఎం అందజేసినా..!
మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీవిరమణకు ముందు... ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వెంట్ల సొసైటీలను, జర్నలిస్టుల సొసైటీలను వేరు చేస్తూ మధ్యంతర తీర్పు నిచ్చారు. దీంతో జర్నలిస్టులకు భూకేటాయింపుపై సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. అయితే... అదిగో, ఇదిగో అంటూ జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకుండానే నాటి సీఎం కేసీఆర్ పదవి నుంచి దిగిపోయారు. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం.. హైదరాబాద్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డి చొరవ చూపారు. అర్హులైన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ మెంబర్లకు ఈ ఏడాది సెప్టెంబర్ 8న స్థలం పత్రాలను అందజేశారు. అయితే తాజా తీర్పుతో పత్రాలు పొందిన జర్నలిస్టులకు నిరాశే మిగిలింది.