ఇదేం కాఫీ షాప్ కాదు : అడ్వకేట్​ ‘యా..యా’ వ్యాఖ్యలపై CJI ఫైర్

ఇదేం కాఫీ షాప్ కాదు : అడ్వకేట్​ ‘యా..యా’ వ్యాఖ్యలపై  CJI ఫైర్

న్యూఢిల్లీ: ఓ కేసు విచారణ సందర్భంగా అభ్యంతరకర పదాలను వాడిన అడ్వొకేట్​పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచ్​కు గౌరవం ఇవ్వకుండా ‘యా..యా’ అంటూ అనడంపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్​ను ప్రతివాదిగా పేర్కొంటూ 2018లో వేసిన పిటిషన్​ను అడ్వొకేట్ సోమవారం కోర్టులో ప్రస్తావించారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘‘ఇది ఆర్టికల్ 32కు సంబంధించిన పిటిషన్ కదా! ఒక జడ్జిని ప్రతివాదిగా పేర్కొంటూ మీరు పిల్ ఎలా వేస్తారు?” అని ప్రశ్నించారు. 

దీనికి అడ్వొకేట్ సమాధానమిస్తూ..‘‘యా..యా.. అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్.. నన్ను క్యురేటివ్ పిటిషన్ ఫైల్ చేయమని చెప్పారు” అని తెలిపారు. ఈ టైమ్ లో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కల్పించుకుని.. ‘‘ఏంటీ యా..యా..? ఇలాంటి భాష అంటే నాకు అలర్జీ. ఇదేం కాఫీ షాప్ కాదు. మీరున్నది కోర్టు రూమ్ అని మరిచిపోవద్దు” అని అడ్వొకేట్​ను మందలించారు. కోర్టులో ఇలాంటివి అనుమతించబోమని చెప్పారు. ‘‘జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ కోర్టులో మాజీ న్యాయమూర్తి. మీరు ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి పిటిషన్ వేయలేరు. ఈ పిటిషన్ ను రిజిస్ట్రీ పరిశీలిస్తుంది. ప్రతివాదిగా జస్టిస్ గొగొయ్  పేరును తొలగించండి” అని ఆదేశించింది.