భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...  భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు జస్టిస్ NV రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు రమణ. తర్వాత అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా...  అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆయన  హనుమకొండలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. దీంతో జిల్లా కోర్టులో అదనపు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 90 యేళ్ల కిందట నిజాంకాలంలో నిర్మించిన భవనాల్లోనే ఇప్పటివరకు కోర్టులు నడుస్తున్నాయి. అవసరాలు పెరగడంతో  21 కోట్ల 65 లక్షలతో  విశాలమైన భవన సముదాయాన్ని నిర్మించారు. కోటి రూపాయలతో పార్కింగ్, అంతర్గత సీసీ రోడ్లు, లాన్ ను ఏర్పాటు చేశారు.  మరో 65లక్షలతో కోర్టు ప్రాంగణంలోనే శిశు సంక్షేమ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పోక్సో కేసులో బాధితులైన మైనర్లు CJI ను కలవడానికి ప్రత్యేక రూట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు జస్టిస్ ఎన్వీ రమణ.