- ప్రతి ప్రైవేట్ ఆస్తిని సమాజవనరుగా భావించలేం: సుప్రీం
- 8:1 మెజార్టీతో చరిత్రాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అన్ని ప్రైవేట్ ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించలేమని, ఉమ్మడి ప్రయోజనాల కోసమంటూ ప్రభుత్వాలు వాటిని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 8:1 మెజార్టీతో 9 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ బెంచ్ లో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సుధాంశ్ ధూలియా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ ఉన్నారు. వీరిలో ఒక్క జస్టిస్సుధాంశ్ ధూలియా వ్యతిరేకమైన తీర్పు ఇవ్వగా, మిగతా అందరూ ఒకే రకమైన తీర్పు ఇచ్చారు. మొత్తంగా మూడు తీర్పులను రాశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తనతో పాటు మరో ఆరుగురి తరఫున తీర్పు రాశారు. ఇదే తీర్పుకు అనుకూలంగా జస్టిస్ బీవీ నాగరత్న సెపరేట్ తీర్పు ఇవ్వగా, జస్టిస్ సుధాంశ్ ధూలియా మాత్రం వ్యతిరేకించారు.
సీజేఐ వ్యాఖ్యలపై జస్టిస్ నాగరత్న అసంతృప్తి..
ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ప్రతి ఆస్తిని సమాజ వనరుగా పరిగణించలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. గతంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పుతో ఏకీభవించడం లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సంబంధించి 1977లో ఏడుగురు సభ్యుల బెంచ్ కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ ఆస్తులన్నీ సమాజ వనరుల పరిధిలోకి రావు అని 4:3తో తీర్పు ఇచ్చింది. అయితే అప్పట్లో దీన్ని వ్యతిరేకించిన వారిలో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఉన్నారు. ఆయన మాత్రం పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీలన్నీ సమాజ వనరుల పరిధిలోకే వస్తాయని తన తీర్పులో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ రాసిన తీర్పుతో ఏకీభవించిన జస్టిస్ బీవీ నాగరత్న.. ఆయన జస్టిస్ కృష్ణ అయ్యర్ తీర్పును ప్రస్తావించడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. భిన్నమైన తీర్పు ఇచ్చినంత మాత్రానా మాజీ న్యాయమూర్తులను దూషించడం, అవమానించడం సరైనదేనా?” అని ప్రశ్నించారు.