టెర్రరిస్టులపై స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి : సుప్రీంకోర్టు

టెర్రరిస్టులపై స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి : సుప్రీంకోర్టు
  • ఆ సాఫ్ట్​వేర్ కలిగి ఉండటం తప్పేమీ కాదు
  • దేశ భద్రత విషయంలో రాజీపడకూడదని కామెంట్​
  • సాధారణ పౌరులపై స్పైవేర్ ఉపయోగిస్తే పరిశీలిస్తాం..
  • దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలుసన్న కోర్టు

న్యూఢిల్లీ: దేశ వ్యతిరేకులు, టెర్రరిస్టులపై పెగాసెస్ స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటని పిటిషనర్లను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పైవేర్ కలిగి ఉండటం తప్పు కాదని స్పష్టం చేసింది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. స్పైవేర్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి దేశంలోని జర్నలిస్టులు, పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఓ పిటిషనర్​ తరఫు అడ్వకేట్ దినేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. 

ప్రభుత్వం వద్ద స్పైవేర్ ఉందా? దాని ఉపయోగించారా? అనేది మా ప్రశ్న. స్పైవేర్ ఉపయోగించినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపి టెక్నికల్ ఎక్స్​పర్ట్ టీమ్ నివేదిక కోసం సుప్రీం గతంలో ఆదేశించింది. ఇప్పటివరకు ఆ నివేదిక అందలేదు. దాన్ని బయట పెట్టాలి’’ అని అడ్వకేట్ అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్‌‌‌‌‌‌‌‌ కలిగి ఉండటంలో తప్పేమీలేదు. కానీ.. అది పౌర సమాజ సభ్యులపై ఉపయోగిస్తే దాన్ని పరిశీలిస్తాం.

 టెర్రరిస్టులపై స్పైవేర్​ను ఉపయోగించడంలో తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. టెక్నికల్ ఎక్స్​పర్ట్ కమిటీ రిపోర్ట్​ను పూర్తిగా బహిర్గతం చేయలేం. ఈ రిపోర్ట్ దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడే సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంది. అందువల్ల నివేదికలోని అంశాలను వీధుల్లో, బహిరంగ సభల్లో చర్చించే పరిస్థితికి తీసుకురాలేము. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు అడిగితే.. వారికి సమాచారం ఇస్తాం’’అని బెంచ్ తెలిపింది. 

మనమంతా జాగ్రత్తగా ఉండాలి

పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ ఘటనను బెంచ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనమంతా కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం. టెర్రరిస్టుల గోప్యత హక్కును కోరకూడదు’’ అని బెంచ్ పేర్కొన్నది. జర్నలిస్ట్ పరంజోయ్ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘‘వాట్సాప్ స్వయంగా పెగాసస్ ద్వారా హ్యాకింగ్ జరిగినట్లు చెప్పింది.

 కేంద్రం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కోర్టు వద్ద ఆధారాలున్నాయి. ఫోన్లు హ్యాక్ అయినట్లు వాట్సాప్ కూడా చెప్పింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కూడా తీర్పు వెలువరించింది’’ అని వాదించారు. దీనిపై స్పందించిన బెంచ్.. ఈ అంశాన్ని జులై 30న జరిపే తదుపరి విచారణలో పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.