
-
= నెల రోజుల్లో ఏర్పాటు చేయాలి
-
= ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలె
-
= అప్పటి వరకు చెట్లు నరకొద్దు
-
= ప్రతివాదిగా సీఎస్ ను చేర్చిన సుప్రీం
-
= మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం
హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల పై అధ్యయనం కోసం నెల రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని, అప్పటి వరకు చెట్ల నరికివేతను ఆపాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. ఇవాళ ఉదయం విచారణకు స్వీకరించిన జస్టిస్ గవాయ్ బెంచ్.. మధ్యాహ్నం 3.30 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు నివేదిక అందగానే సాయంత్రం 4 గంటలకు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. ఇవాళ ఉదయం మీడియాలో, పత్రికల్లో వచ్చిన కథనాలను జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అమికస్ క్యూరీ పరమేశ్వర్ మెన్షన్ చేశారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అత్యవసరంగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావ సర్టిఫికెట్ తీసుకున్నారా? ఫారెస్ట్ విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారా? అని అడిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వాదనల సందర్భంగా అది అటవీ ప్రాంతం కాదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మూడు రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని వ్యాఖ్యానించింది.
హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలో ఫొటోలు చూశాక పరిస్థితి అర్థమవుతోందని కోర్టు కామెంట్ చేసింది. వందల కొద్దీ యంత్రాలు మోహరించి చెట్లు నరకాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించింది.