జర్నలిస్టుపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు ఊరట లభించింది.. ఈ కేసు విచారణను నాలుగు వారాల వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించింది.
నష్టపరిహారం కావాలా జైలుకు పంపాలా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. మోహన్ బాబు తరఫున వాదన వినిపించారు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్.
మోహన్ బాబు తరఫున వాదనలు:
తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందని.. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పానని పేర్కొన్నారు మోహన్ బాబు. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని.. 76 ఏళ్ల వయసున్న తాను కావాలని దాడి చేయలేదని, ఆవేశంలో జరిగిందని... జర్నలిస్టులు నా ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారన అన్నారు మోహన్ బాబు.
జర్నలిస్ట్ తరఫున వాదనలు:
తనపై మోహన్ బాబు దాడి చేశాడని.. ఐదు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నానని పేర్కొన్నారు జర్నలిస్ట్. సర్జరీ జరిగి.. నెల రోజులుగా పైపు ద్వారానే ఫుడ్ తీసుకుంటున్నానని అన్నారు. దాడి చేయడమే కాకుండా కించపరిచారని.. ప్రొఫెషనల్ గా నష్టం జరిగిందని, నా కెరీర్ ను నష్టపోయానని పేర్కొన్నారు జర్నలిస్ట్ .