అపోహలతో విచారణను బదిలీ చేయలేం.. ఓటుకు - నోటు’ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

అపోహలతో విచారణను బదిలీ చేయలేం.. ఓటుకు - నోటు’ కేసులో సుప్రీం వ్యాఖ్యలు
  • పొలిటికల్ పార్టీలతో చర్చించి తీర్పులిస్తున్నామా? అని ఆగ్రహం

న్యూఢిల్లీ, వెలుగు: కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అని ‘ఓటుకు -నోటుకు’కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అయితే ప్రస్తుత స్థితిలో విచారణ బదిలీ పిటిషన్ ను ముందస్తుగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది.  ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు.. మహ్మద్ అలీ, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను గురువారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన బెంచ్ విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్లు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ్ లూథ్రా, మేనకా గురుస్వామీ, పిటిషనర్ల తరఫున ఆర్యమా సుందరం, దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావు హాజరయ్యారు. అడ్వకేట్ సుందరం వాదిస్తూ కేసులో నిందితుడు సీఎంగా ఉన్నారని, హోంశాఖ, అవినీతి నిరోధక శాఖలు స్వయంగా ఆయన చేతిలోనే ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను, దర్యాప్తు సంస్థల అధికారులను ఇంకా విచారించలేదన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత వైఖరిని మార్చుకుందని ఆరోపించారు. ఈ సందర్భంగా శేషాద్రి నాయుడు జోక్యం చేసుకొని... తెలంగాణ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ తీరు, పోలీసు అధికారులతో పాటు, సుప్రీంకోర్టుకు సంబంధించి రేవంత్​ రెడ్డి గతంలో చేసిన పలు వ్యాఖ్యలతో పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

జస్టిస్ బీఆర్ గవాయి స్పందిస్తూ... ‘సీఎం స్థాయి హోదాలోని వ్యక్తి కామెంట్స్ తో కొందరి ఆలోచనల్లో భయాందోళనలు కలిగించవచ్చు. పొలిటికల్ పార్టీలను సంప్రదించి మేము తీర్పులు ఇస్తున్నామా?. అయితే మేము రాజకీయ నాయకుల గురించి చింతించము. మేము మా విధిని మనస్సాక్షిగా, ప్రమాణంగా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అలాగే పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలపై ప్రభుత్వ తరఫు అడ్వకేట్లు ముకుల్ రోహిత్గి, సిద్దార్థ లూత్రా, మేనకాగురుస్వామి అభ్యంతరం తెలిపారు. మొదటి నుంచి కేసు దర్యాప్తు అధికారుల్లో ఎలాంటి మార్పు లేదని కోర్టకు నివేదించారు. ఆగస్టు 2021 లో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను నిలిపివేసిందని నివేదించారు.

ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి స్పందిస్తూ.. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. 2021 నుంచి స్టే అమలులో ఉందని, 2024 ఎన్నికల తర్వాత పిటిషనర్లు కోర్టు ను ఆశ్రయించినట్లు పేర్కొంది. విచారణ బదిలీని నిరాకరిస్తూనే.. ఇరు పక్షాల్లో విశ్వాసాన్ని నింపేలా స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్ పీపీ) ను ఏర్పాటు చేస్తూ.. పిటిషన్ డిస్మిస్ చేస్తామని వ్యాఖ్యానించింది. అయితే తెలంగాణ హైకోర్టు ను సంప్రదించి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ ఇస్తామని బెంచ్ స్పష్టం చేసింది. అంతలోపు ఎస్ పీపీ ల కోసం ఇద్దరి పేర్లను సూచించాలని ఆదేశించింది. తర్వాతి విచారణను సెప్టెంబర్ 2 కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.