
- ఈ అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం
- ఎంత టైమ్‌లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది గత తీర్పుల్లో స్పష్టంగా లేదు
- ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలం? అని ప్రశ్న
- స్పీకర్ తేల్చే వరకూ కోర్టులు జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ సెక్రటరీ అఫిడవిట్
న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చా? అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని, క్వశ్చన్ ఆఫ్ లా వరకే పరిశీలిస్తున్నట్టు తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయించిన వ్యక్తి లోక్‌సభ/అసెంబ్లీ/జిల్లా పరిషత్‌కు పోటీ చేశారా? అనేది తాము పట్టించుకోబోమని.. ఆ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని స్పష్టం చేసింది.
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏడాదైనా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరఫు లాయర్ ప్రస్తావించగా.. ‘‘ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి.
అయితే స్పీకర్ ఎప్పటిలోగా తేల్చాలనే దానిపై ఆ తీర్పుల్లో స్పష్టంగా చెప్పలేదు. అలాంటప్పుడు మేం వాటిని కాదని ఎలా ముందుకు వెళ్లగలం. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలం?” అని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫు లాయర్ మళ్లీ స్పందిస్తూ.. స్పీకర్‌కు తగినంత టైమ్ విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని చెప్పారు. ఆ కేసులను ఉదహరించారు.
పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా?
పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ... ‘‘పోయినేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. జూన్‌లో రిట్ పిటిషన్ వేశాం. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని కోర్టుకు దృష్టికి తెచ్చాం. మరో ఎమ్మెల్యే తన కూతురు కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. ఇంకో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారు. వీరిపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదు. కనీసం నోటీసులు ఇవ్వలేదు.
దీనిపై హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలని 4 వారాలు టైం ఇచ్చింది. అయితే స్పీకర్ కార్యాలయం అప్పీల్‌కు వెళ్లగా, తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. కానీ ఇప్పటి వరకు తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మూడు వారాలు పూర్తయినా ఆ నోటీసులు ఎటు వెళ్లాయో తెలీదు. మేం స్పీకర్‌కు ఫిర్యాదు చేసి దాదాపు ఏడాది పూర్తి అయింది” అని చెప్పారు.
ఈ క్రమంలో జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ‘పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా?’ అని వ్యాఖ్యానించారు. సుందరం మళ్లీ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘స్పీకర్ క్వాషి జ్యూడిషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. స్పీకర్ అధికారాల్లో, విధుల్లో జోక్యం చేసుకోవాలని మేం కోరడం లేదు.
ఆయన రాజ్యాంగ విధులు నిర్వర్తించేలా చూడాలని మాత్రమే మేం కోరుతున్నాం” అని అన్నారు. కాగా, స్పీకర్ సెక్రటరీ తరఫు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ..ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారని, నోటీసులు ఇచ్చారని చెప్పారు. కేటీఆర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ దామా శేషాద్రి వాదనలు వినిపిస్తూ.. రాజేంద్రసింగ్ రాణా కేసులో స్పీకర్ టైమ్‌పై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
స్పీకర్ చట్టప్రకారమే వ్యవహరిస్తున్నరు: అసెంబ్లీ సెక్రటరీ
ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు అఫిడవిట్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారని మొత్తం 41 పేజీల అఫిడవిట్ వేశారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, స్పీకర్‌ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారని అందులో ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లను కొట్టేయాలని అభ్యర్థించారు. అలాగే స్పీకర్ తేల్చే వరకూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులను అఫిడవిట్‌లో పొందుపరిచారు.
ఏలేటి పిటిషన్‌పై విచారణ..
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయన తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తా వించబోతుండగా.. జస్టిస్ బీర్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాము ఈ వ్యవ హారంలో మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చామని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ కార్యాలయం తరఫున వాదనలు వినిపించేందకు సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీకి అనుమతి ఇచ్చారు. అయితే తమకు సుదీర్ఘ సమయం కావాలని ఆయన కోరగా.. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి (ఏప్రిల్ 2) వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.