జడ్జిల నియామకంలో తెలుగులో నైపుణ్యంపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

జడ్జిల నియామకంలో తెలుగులో నైపుణ్యంపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
  • తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్
  • స్వీకరణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలో జడ్జిల నియామకానికి అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్​ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. తెలంగాణ జ్యుడీషియల్‌‌  (సర్వీస్‌‌ అండ్‌‌ కేడర్‌‌) రూల్స్– 2023 ద్వారా ఉర్దూను మినహాయించారని పిటిషనర్‌‌  మహ్మద్‌‌  షుజాత్‌‌  హుస్సేన్‌‌  రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. 

జూన్‌‌ 2023లో అమల్లోకి తెచ్చిన నూతన గైడ్ లైన్స్  ప్రకారం తెలుగులో ప్రావీణ్యత తప్పనిసరిగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. అయితే, తన విద్యాభ్యాసం పూర్తిగా ఉర్దూ మీడియంలోనే జరిగిందని, కొత్త  నిబంధన కారణంగా తనకు అన్యాయం జరిగిందని పిటిషనర్  ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఉర్దూలో ప్రావీణ్యత అవకాశాన్ని కల్పించాలన్నారు. తెలంగాణ అధికార భాషల చట్టం– 1966 ప్రకారం ఉర్దూ రెండో అధికార భాషగా గుర్తింపు పొందిందని, తెలంగాణ సంస్కృతిలో ఉర్దూ భాగమని పిటిషనర్  తెలిపారు. 

ఈ వాదనలతో విభేదించిన హైకోర్టు.. ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హుస్సేన్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్​ను సోమవారం సుప్రీంకోర్టు జస్టిస్‌‌  బీఆర్‌‌ గవాయ్, అగస్టీన్‌‌  జార్జ్‌‌ మసీహ్‌‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్లు వాదనలు వినిపిస్తూ... పరీక్షల్లో ఉర్దూను  మినహాయించలేదని, తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలన్న నిబంధన మాత్రమే చేర్చారని బెంచ్ కు నివేదించారు.