మరో ఐదున్నరేండ్లు ఉందిగా...గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

మరో ఐదున్నరేండ్లు ఉందిగా...గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లకు మరో ఐదున్నరేండ్ల సమయం ఉందిగా అని వ్యాఖ్యానించింది. దీనిపై వచ్చే నెల 20న తుది వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామక కేసులో తెలంగాణ గవర్నర్ కార్యాలయం దాఖలు చేసిన సివిల్ అప్పీల్స్ (సీఏ)పై బుధవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది.  

ప్రతివాదులుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్య నారాయణ తరఫు అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ముందుగా తాము పిటిషన్​ దాఖలు చేశామని, ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైందని కోర్టు  దృష్టికి తెచ్చారు. కొత్త ప్రభుత్వం ఇద్దరి పేర్లను ప్రతిపాదించిందని, వాళ్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం కూడా చేశారని నివేదించారు.


 ఈ వాదనలపై గవర్నర్ తరపు అడ్వొకేట్ అభ్యంతరం తెలిపారు. సమయానుగుణంగా గవర్నర్ ప్రతిపాదనలను అమోదించారని వెల్లడించారు. చివర్లో ప్రతివాది తరఫు అడ్వొకేట్ పలు అంశాలను లేవనెత్తగా.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అయిన వారికి పదవీకాలం ఎంత ఉందని జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రశ్నించారు. ఇందుకు ప్రతివాది అడ్వొకేట్ బదులిస్తూ 6 నెలలు గడిచిందన్నారు. దీనిపై ధర్మాసనం కీలక కామెంట్స్ చేసింది. ‘‘కేవలం 6  నెలలు మాత్రమే ముగిసింది. ఇంకా ఐదున్నరేండ్ల గడువు ఉంది. అంటే 2031 వరకు ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది”అని జస్టిస్ విక్రమ్ నాథ్ వ్యాఖ్యానించారు. 
ఇరువైపులా వాదనలు విన్నధర్మాసనం.. ఈ వ్యవహారానికి సంబంధించి ఉదయం దాఖలైన పిటిషన్ల ను మార్చి 20 కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.  అదే రోజు ఈ అప్పీల్స్ ను కూడా విచారిస్తామని చెప్పింది. 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని  ప్రతివాదులుగా ఉన్న దాసోజు, కుర్రాను కోర్టు ఆదేశించింది. ఈ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ అయిన గవర్నర్ ఆఫీస్ కు రెండు వారాల టైం ఇచ్చింది. మార్చి 20 న తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది.