హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్లకట్టలు ..సుప్రీం ప్యానెల్ తో ఎంక్వైరీ

హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్లకట్టలు ..సుప్రీం ప్యానెల్ తో ఎంక్వైరీ

న్యూఢిల్లీ: హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్లకట్టలు బయటపడ్డ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా జస్టిస్ వర్మపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను ఏర్పాటు చేస్తూ సీజేఐ జస్టిస్ సంజీవ్​ ఖన్నా ఆదేశాలు శనివారం జారీ చేశారు. జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన నగదు ఎక్కడిదనే విషయం తేల్చాలని ఈ కమిటీని ఆదేశించారు. కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీఎస్.సంధవాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ లకు చోటు కల్పించారు. ఈమేరకు శనివారం సుప్రీంకోర్టు ఒక ప్రకటనను 

విడుదల చేసింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతం ఎలాంటి పనులు అప్పగించొద్దని ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు ఈ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదిక, జస్టిస్ వర్మ స్పందన, ఇతర పత్రాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నట్టు పేర్కొంది.

వర్మపై గతంలో సీబీఐ కేసు..

జస్టిస్ వర్మపై గతంలో సీబీఐ కేసు నమోదైందనే విషయం తాజాగా బయటకువచ్చింది. 2018లో ఉత్తరప్రదేశ్‌‌లో జరిగిన బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో సీబీఐ ఆయనను నిందితుడిగా చేర్చింది. యూపీకి చెందిన సింభోలి షుగర్ మిల్స్ రుణ పథకం కింద ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) హాపూర్ బ్రాంచ్ నుంచి లోన్ తీసుకుంది. రైతుల పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి రూ.148.59 కోట్లు సేకరించింది. లోన్‌‌ను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ ఫిర్యాదు చేసింది. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. షుగర్ మిల్స్ డైరెక్టర్లతో పాటు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌గా ఉన్న జస్టిస్ వర్మను నిందితుడిగా చేర్చింది.