- ఇష్టపూర్వకంగానే ఉంటున్నట్లు కోర్టుకు చెప్పిన యువతులు
కొయంబత్తూరు : తన ఇద్దరు బిడ్డలను ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా యోగా సెంటర్ నిర్వాహకులు బ్రెయిన్ వాష్ చేసి బందీగా ఉంచారని పేర్కొంటూ ఓ తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టేసింది. యోగా నేర్చుకునేందుకు వెళ్లిన తన కూతుళ్లు గీత, లత అక్కడే ఉండిపోయారని రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ తన హెబియస్ కార్పస్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇద్దరినీ గదిలో బంధించి హింసిస్తున్నట్లు తెలిసిందని తెలిపారు.
దీనిపై విచారించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గీత, లత ఇష్టపూర్వకంగానే ఈషా యోగా సెంటర్లో ఉంటున్నారు. వాళ్లిద్దరూ మేజర్లు. నచ్చిన చోట ఉండే హక్కు వాళ్లకు ఉంటది. సేఫ్‌గానే ఉన్నామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందుల్లేవన్నరు. గీత, లత ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలిసింది. అందువల్ల హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టేస్తున్నం. ఇక, ఈ కేసులో మద్రాస్ హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
అసలు కేసు ఏంటి?
కొయంబత్తూరుకు చెందిన గీత, లత యోగా నేర్చుకునేందుకు ఈషా యోగా సెంటర్‌కు వెళ్లారు. తర్వాత వాళ్లు అక్కడే ఉండిపోయారు. తల్లిదండ్రులు ఎంత కోరినా.. ఇంటికి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో వాళ్ల తండ్రి రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈషా యోగా సెంటర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఇద్దరు కూతుళ్లను బ్రెయిన్ వాష్ చేసి తమ నుంచి దూరం చేశారంటూ పేర్కొన్నారు.