తిరుమల ఒక్కటేనా ఆలయం అంటే : కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

తిరుమల ఒక్కటేనా ఆలయం అంటే : కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు సుప్రీం కోర్టు ఇచ్చింది... తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కేఏ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఈ పిటీషన్ పై శుక్రవారం ( నవంబర్ 8, 2024 ) ఉదయం విచారణ చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. తిరుమల దేవాలయాల నిర్వహణ పాలకమండలి చేతిలో కాకుండా పూజారుల చేతుల్లో ఉంచాలని పిటిషన్‌లో కేఏ పాల్‌ కోరారు. కేవలం 744 మంది కేథలిక్‌లు ఉన్న వాటికణ్ సిటీని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారని.. లక్షలాది మంది భక్తులకు ప్రాధాన్యత ఉన్న తిరుమలను కూడా ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని కోరారు కేఏ పాల్.

దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని.. అన్నిటికీ ప్రత్యేక హోదా కల్పించలేమని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు కేఏ పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో సుప్రీం తీర్పుపై స్పందించిన కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పిటిషన్ విచారించినందుకు ధర్మాసనానికి కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తన పిటిషన్ కి కేవలం 5 నిముషాల సమయం మాత్రమే ఇచ్చారని...కోట్లాది మంది హిందువుల కు సంబంధించిన అంశానికి సమయం ఇవ్వలేదని అన్నారు. 

Also Read : పుట్టిన రోజు వేళ యాదగిరి గుట్టలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు

మతపరమైన స్వేచ్చకు తిరుమలలో విఘాతం కలుగుతుందని.. హిందు ఆలయాలను హిందు అర్చకులు పూజరులే నిర్వహించుకోవాలని అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ లు వారి మసీదులు,చర్చిలను వారే నిర్వహించుకుంటున్నారని అన్నారు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశంపై మరోసారిసుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తానని వెల్లడించారు పాల్. 

లడ్డు కల్తీ వ్యవహారం పై దర్యాప్తుకు 3 లేదా 6 నెలల కాలపరిమితి విధించేలా ఆదేశాలివ్వాలని, తిరుమలలో హిందు క్రిస్టియన్ గొడవలు జరగకుండా ఉండాలంటే తిరుమల ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు పాల్. తిరుమల వ్యవహారం పై పోరాటం కొనసాగుతుందని అన్నారు కేఏ పాల్.