- సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలన్న పిటిషన్లు కొట్టివేత
న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠిక అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రాజ్యాంగ పీఠికను సవరించే అధికారం పార్లమెంట్ కు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చగా.. దాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి, అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్, బలరామ్ సింగ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సీజేఐ నేతృత్వంలోని బెంచ్ సోమవారం తీర్పు వెలువరించింది.
‘‘ఆర్టికల్ 368 ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ కు ఉంది. పీఠిక రాజ్యాంగంలో భాగమే కాబట్టి, దాన్ని సవరించే అధికారం కూడా పార్లమెంట్ కు ఉంటుంది. రాజ్యాంగ పీఠికను ఆమోదించిన తేదీ (1949 నవంబర్ 26).. ఆర్టికల్ 368 అధికారాన్ని అడ్డుకోలేదు” అని తీర్పులో వెల్లడించింది. ఇన్నేండ్ల తర్వాత ఈ ఇష్యూను లేవనెత్తాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించింది. దీనిపై విచారణ అక్కర్లేదని తెలిపింది. కాగా, ‘‘సోషలిజం, సెక్యులరిజం అనేవి రాజ్యాంగంలో అంతర్భాగం. ఈ పదాలకు వివరణలు ఉన్నాయి. కానీ కొందరు వేర్వేరుగా అన్వయించుకుంటున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే సోషలిజం. సెక్యులర్ పదం కూడా అంతే” అని గతంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎమర్జెన్సీ టైమ్లో పార్లమెంట్‌లో చేసిన సవరణలన్నీ తప్పులని చెప్పలేమని పేర్కొంది.
లీగల్ ఎడ్యుకేషన్ పై కేంద్రానికి నోటీసులు..
స్కూళ్లలో లీగల్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఓటర్ల లిస్టులో డూప్లికేషన్స్, మల్టీపుల్ ఎంట్రీలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అయితే దీన్ని కోర్టు తిరస్కరించింది. కాగా, ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనపై నిరసనలకు సంబంధించి ఓ మహిళను పోలీస్ కస్టడీలో టార్చర్ చేసిన కేసుపై సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకు కలకత్తా హైకోర్టు ఆదేశించగా, ప్రతి దానికీ సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఢిల్లీలో స్కూల్స్ రీఓపెన్ చేయండి..
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో స్కూల్స్ రీఓపెన్ అంశాన్ని పరిశీలించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కు సుప్రీంకోర్టు సూచించింది. ‘‘ ఇండ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్ లేవు. కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా పెద్ద తేడా లేదు. స్కూల్స్ రీఓపెన్ చేసే అంశాన్ని పరిశీలించండి” అని పేర్కొంది. దాంతో హైబ్రిడ్ మోడ్(ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్) లో స్కూళ్లను రీఓపెన్ చేయాలని ఢిల్లీ సర్కారనును ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ ప్యానెల్ సోమవారం ఆదేశించింది. ఈ ఆదేశంతో మంగళవారం నుంచి స్కూళ్లు ఓపెన్ కానున్నాయి.