కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీం షాక్​.. ఎస్ఎల్ పీని డిస్మిస్ చేసిన కోర్టు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు బుధవారం సుప్రీంకోర్టు షాక్​ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో రిటర్నింగ్​ఆఫీసర్​కు సమర్పించిన అఫిడవిట్​లో కూనంనేని పూర్తి వివరాలు పేర్కొనలేదని కొత్తగూడెంకు చెందిన నందులాల్ హైకోర్టులో గతేడాది పిటిషన్​ వేశారు. ఫారం –26 ఎన్నికల అఫిడవిట్ లో సమగ్ర వివరాలు వెల్లడించలేదని, తన భార్య పేరును కూనంనేని పేర్కొనలేదని, లైసెన్స్ డ్​ నోటరీతో అఫిడవిట్​చేయించలేదనే పలు అంశాలతో ఆయన హైకోర్టులో పిటిషన్​ వేశారు. 

ఎమ్మెల్యేగా కూనంనేని ఎన్నికను సవాల్​ చేస్తూ నందులాల్ వేసిన పిటిషన్​పై హైకోర్టులో వాదనలు జరిగాయి. తెలంగాణ హైకోర్టులో తనపై దాఖలైన పిటిషన్ ను కొట్టి వేయాలని గతంలో కూనంనేని సుప్రీం కోర్టులో స్పెషల్​లీవ్ పిటిషన్ (ఎస్ఎల్ పీ) దాఖలు చేశారు. కూనంనేని పిటిషన్ ను జస్టిస్​సూర్యకాంత్​ధర్మాసనం విచారించింది. వాదోపవాదనలు విన్న తర్వాత కూనంనేని దాఖలు చేసిన ఎస్ ఎల్ పీని సుప్రీం ధర్మాసనం డిస్మిస్​ చేసింది.  
కాగా, సుప్రీం తీర్పుపై కూనంనేని స్పందించారు. తాను ఐదేండ్ల పాటు కొనసాగుతానని తన పదవికి ఢోకా లేదని తెలిపారు.