విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్ రావు

విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్ రావు

బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి, అక్రమ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విద్యుత్ విచారణ కమిషన్ గా జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ చైర్మన్ విషయంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు సూచనలు, సలహాలు చేసింది. ఈ క్రమంలోనే కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇందులో భాగంగానే 2024, జూలై 30వ తేదీన విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా.. ఉమ్మడి ఏపీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు లోకూర్. ఇప్పటి విచారణ చేసిన నర్సింహారెడ్డి స్థానంలో.. ఇక నుంచి లోకూర్ విచారణ చేయనున్నారు.

జస్టిస్ లోకూర్ 1977లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. డిగ్రీ పొందారు. ఆయన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, రెవెన్యూ, సేవల చట్టాల్లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 1998 జూలై 14న ఆయన అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1999 ఫిబ్రవరి 19న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది జూలై 5న ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 ఫిబ్రవరి 13 నుంచి మే 21 వరకూ ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. జస్టిస్ లోకూర్ 2012 జూన్ 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.