
న్యూఢిల్లీ, వెలుగు: వర్క్ ప్లేస్ లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు తీసుకువచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ (పోష్) యాక్ట్ 2013 అమలులో కోర్టు ఆదేశాలను పాటించనందుకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సుప్రీంకోర్టు రూ.5 వేల ఫైన్ విధించింది. పోష్ యాక్ట్ అమలు వ్యవహారంలో గోవాకు చెందిన ఔరేలియానో ఫెర్నాండెజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 3న ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా... ఈ వ్యవహారంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలు తదితర అంశాలతో కూడిన సమగ్ర వివరాలను ఫిబ్రవరి 11లోపు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే.. తెలంగాణ తోపాటు మణిపూర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఈ ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో ఈనెల 11న ఈ పిటిషన్ పై మరోసారి విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం.. ఆయా రాష్ట్రాల తీరుపై అసంతృత్తి వ్యక్తం చేస్తూ ఒక్కో రాష్ట్రానికి రూ.5 వేల జరిమానా విధించింది. రెండు వారాల్లో ఆ జరిమానా చెల్లించాలని, మూడు వారాల్లో అపిఢవిట్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
తదుపరి విచారణను మార్చి 25 కు వాయిదా వేసింది. కాగా... డిసెంబర్ 3న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మహిళలకు కార్యాలయ భద్రతను నిర్ధారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు(ఐసీసీ) లు లేనిచోట స్థానిక ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుల కోసం నోడల్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది.