ఇండ్లు కూల్చడమేంటి..? బుల్డోజర్ ట్రీట్మెంట్‎పై సుప్రీంకోర్టు ఫైర్

ఇండ్లు కూల్చడమేంటి..? బుల్డోజర్ ట్రీట్మెంట్‎పై సుప్రీంకోర్టు ఫైర్

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడు అయినంత మాత్రానా అతని ఇంటిని ఎలా కూల్చేస్తరు అని పలు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు నిలదీసింది. ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది. చాలా రాష్ట్రాలు బుల్డోజర్‎లతో నిందితుల ఇండ్లను అకారణంగా కూల్చేస్తున్నాయని మండిపడింది. ఇలా కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‎తో కూడిన బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ జహంగీర్‌‌‌‌పురిలో నిందితుడు అద్దెకున్న ఇంటిని కూల్చివేయడంపై సీనియర్‌‌‌‌అడ్వకేట్లు దుష్యంత్‌‌‌‌దవే, సీయూ సింగ్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. 

Also Read:-స్వాతి మలివాల్‌పై దాడి కేసు

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ బెంచ్‌‌‌‌ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘అతను దోషిగా తేలితే.. చట్ట ప్రకారం నడుచుకోవాలి కదా..? అలా చేయకుండా బుల్డోజర్ పంపించి ఇంటిని కూల్చేయడం ఏంటి..? ఈ నయా ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఏదైనా కట్టడం అక్రమం అయితే.. దాన్ని కూల్చేందుకు ఒక ప్రొసీజర్ ఉంటది. అవసరమైతే ఆ కట్టడాన్ని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న కూల్చివేతల ట్రెండ్‌‌‌‌పై మేం మార్గదర్శకాలు జారీ చేస్తాం’’ అని బెంచ్ తెలిపింది.

అక్రమ కట్టడమైతేనే కూలుస్తున్నం: ఎస్జీ

సుప్రీంకోర్టు కామెంట్లపై ఉత్తరప్రదేశ్ తరఫు నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘కేవలం నిందితుడిగా ఉన్నాడని ఏ వ్యక్తి స్థిరాస్తిని కూల్చివేయట్లేదు. అది అక్రమకట్టడం అయితేనే చర్యలు తీసుకుంటున్నం. మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నం. అక్రమ కట్టడం అయితేనే ముందు నోటీసు ఇచ్చి ఆ తర్వాతే కూల్చేస్తున్నం’’ అని తుషార్ మెహతా అన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘రోడ్లకు అడ్డంగా నిబంధనలు పాటించకుండా ఉన్న అక్రమ కట్టడాలను మేము రక్షించడం లేదు.

 పబ్లిక్ రోడ్లపై ఉన్న ఆలయాలను కూడా కాపాడట్లేదు. అన్ని రాష్ట్రాలు ఇలాగే బుల్డోజర్లు ఉపయోగిస్తే ఎలా?’’ అని బెంచ్ ప్రశ్నించింది. తుషార్ మెహతా స్పందిస్తూ..‘‘ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్రాలతో చర్చిస్తాం. చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించడం లేదు. నేరానికి పాల్పడినందుకే ఇండ్లు కూల్చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరు’’ అని తెలిపారు. 

ఏదో ఒక కారణంతో కూల్చేస్తున్నరు

ఏదో ఒక కారణం చూపుతూ నిందితుల ఇండ్లను కూల్చడం సరికాదని బెంచ్ తెలిపింది. ‘‘నేరం చేశామనే తమ ఇండ్లను కూల్చేశారంటూ పిటిషనర్లే చెప్తున్నరు. కూల్చివేతలు ఆపేందుకు ఇరు పక్షాల అడ్వకేట్లు మాకు సూచనలు ఇవ్వండి. పాన్ ఇండియా బేసిస్‌‌‌‌లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. అందరి వాదనలు విన్నం.. కోర్టు రూమ్‎ను యుద్ధ భూమిగా మార్చొద్దు. విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నం’’ అని బెంచ్ తెలిపింది.