![Ranveer Allahabadia: నీది ఎంత నీచమైన బుద్దో.. నీ మాటలే చెబుతున్నాయి : రణ్ వీర్ అల్లాబాడియాపై సుప్రీం ఆగ్రహం](https://static.v6velugu.com/uploads/2025/02/supreme-court-fires-on-ranveer-allahabadia-on-his-comments-in-a-tv-show_BKqAcHLtds.jpg)
‘ఇండియాస్ గాట్ లేటెంట్’ అనే షోలో యూట్యూబర్ రన్ వీర్ అల్లాబాడియా వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు ఫాలోవర్లు ఉన్నారని, పాపులారిటీ ఉందని ఏదైనా మాట్లాడతారా అని మండిపడింది. ‘‘మనిషనేవాడు ఎవరైనా ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారా.. కనీసం వినటానికి ఇష్టపడతాడా.. ఇవి తీవ్రంగా ఖండించాల్సిన వ్యాఖ్యలు’’ అని వ్యాఖ్యానించింది.
య్యూటూబర్ రణ్ వీర్ అల్లాబావియాపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి :
- వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని.. ఏది పడితే అది.. ఎలా పడితే అలా మాట్లాడేస్తావా.. నీకు అసలు బుర్ర ఉందా..?
- మాట్లాడే స్వచ్ఛ ఉంది కదా అని నిబంధనలకు విరుద్ధంగా.. సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదు
- నీ బూతు బుర్రను.. నీ బూతు ఆలోచనలను బయటపెట్టటానికి మీకు ఏమైనా లైసెన్స్ ఉందా..?
- నిన్ను నువ్వు సమర్థించుకోవటానికి గౌహతి కోర్టుకు ఎందుకు వెళ్లకూడదు.. నిన్ను నువ్వు నిరూపించుకోవచ్చు కదా..?
- నీ మాటలు.. నీ వికృతమైన మనస్సును చూపిస్తున్నాయి.. ఇంత కంటే నీచమైన మనస్సు ఎవరికీ ఉండదు అనుకోవచ్చు..
- నువ్వు ఉపయోగించని పదాలు.. నీ వక్రబుద్ధిని చెబుతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లనే కాదు పిల్లలు కూడా సిగ్గుపడేలా చేస్తున్నాయి.
- సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి.. చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ చెబుతున్నావ్.. ఈ బెదిరింపులు కూడా నీ ప్రచారం కోణంలోనే కనిపిస్తున్నాయి..
- సమాజంలో కట్టుబాట్లు.. విలువలు ఉన్నాయి.. అందుకు నువ్వు అతీతుడికి ఏమీ కాదు.. నువ్వు ఉపయోగించిన భాష అంత అసహ్యంగా ఉంది..
యూట్యూబర్ రణ్ వీర్ అల్లాబాడియా ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో తల్లిదండ్రులపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే రణ్ వీర్ ను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని రణ్ వీర్ అడ్వకేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిల్ పై మంగళవారం (ఫిబ్రవరి 18) విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ముంబయి, గౌహతి, జైపూర్ తదితర ప్రాంతాలలో నమోదైన ఎఫ్ఐఆర్ లతో అల్లబాడియా అరెస్టు చేయకుండా తాత్కాలికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల నుంచి రక్షణ పొందేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పాపులారిటీ కోసం నీచమైన వ్యాఖ్యలు చేసిన అల్లాబాడియా.. రక్షణ కోరడం కూడా పాపులారిటీ స్టంట్ లో భాగమే అనుకోవాలా అని ప్రశ్నించింది సుప్రీం కోర్టు.
అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, పాస్ పోర్టును సబ్మిట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.