ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ నిరాకరణ

 ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ నిరాకరణ
  • జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌‌ను కొట్టివేసింది. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కర్నాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

దీంతో ప్రజ్వల్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను జస్టిస్ బేల ఎం త్రివేది, సతీశ్​చంద్ర శర్మలతో కూడిన బెంచ్​ సోమవారం విచారించింది. ప్రజ్వల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ..ఈ కేసులో ఛార్జ్‌‌షీట్ వేశారు కానీ, ప్రాథమిక ఫిర్యాదులో ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేయలేదన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ విషయంలో కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.