- రెట్రోస్పెక్టివ్ పద్ధతిలో ట్యాక్స్ వేసేందుకు అనుమతి
- ఏప్రిల్ 1, 2005 తర్వాత లావాదేవీలపై విధింపు
- ప్రభుత్వ కంపెనీలకు రూ.70 వేల కోట్ల వరకు నష్టం!
- పెరగనున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ
న్యూఢిల్లీ: మెటల్, మైనింగ్ కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. మైనింగ్ కార్యకలాపాలపై రెట్రోస్పెక్టివ్ పద్ధతిలో (గతంలో జరిగిన కార్యకలాపాలపై కొత్తగా ట్యాక్స్ వేయడం) ట్యాక్స్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిచ్చింది. ఈ అంశంపై ఈ ఏడాది జులై 25 న ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది జడ్జీలతో కూడిన బెంచ్ బుధవారం సమర్థించింది. తాజా తీర్పుతో 2005, ఏప్రిల్ 1 తర్వాత జరిగిన మైనింగ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ వేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా 2026, ఏప్రిల్ 1 తర్వాత నుంచి 12 ఏళ్లలో ఇన్‌స్టాల్‌మెంట్‌లో ట్యాక్స్ పేమెంట్స్ చేయడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చింది. ఈ ఏడాది జులై 25 కి ముందు వేసిన వడ్డీలు లేదా పెనాల్టీలను రద్దు చేయాలని ఆదేశించింది.
జులై 25 న ఇచ్చిన తీర్పేంటంటే?
మైనింగ్ కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్‌కు ఇస్తున్న రాయల్టీ పేమెంట్స్ ట్యాక్స్ కిందకు రావని, అందువలన మైనింగ్, మినరల్స్ పనులపై సెస్ వేయడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీం కోర్టు కిందటి నెల 25 న తీర్పిచ్చింది. రెట్రోస్పెక్టివ్ ప్రాతిపదికన ట్యాక్స్ వేయాలా? వద్దా? అనే అంశంపై ఈ తీర్పుపై మళ్లీ విచారణ జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మైనింగ్ , మినరల్స్ పనులపై ట్యాక్స్ వేసే అధికారం ఉందా? లేదా? అనే అంశం చుట్టూ విచారణ జరిగింది. తాజాగా మైన్స్ అండ్ మినరల్స్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
మైన్స్, మినరల్స్ ఆపరేటర్ల నుంచి 1989 నుంచి సేకరించిన రాయల్టీలను రిఫండ్ చేయాలని కోరే అధికారం రాష్ట్రాలకు లేదని, దీనిని వ్యతిరేకిస్తున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అదే జరిగితే ప్రభుత్వ కంపెనీలకు రూ.70 వేల కోట్ల వరకు నష్టం వస్తుందని వాదించింది. బకాయిలు రూ.రెండు లక్షల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని ఈ రంగానికి చెందిన కంపెనీలు అంటున్నాయి.
మెటల్ ఇండెక్స్ 3 శాతం డౌన్
మైనింగ్, మినరల్ కార్యకలాపాలపై రెట్రోస్పెక్టివ్ పద్ధతిలో ట్యాక్స్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ సెక్టార్‌లోని కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. బుధవారం ఇంట్రాడేలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం పతనమయ్యింది. హిందుస్థాన్ జింక్, ఎన్‌ఎండీసీ, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, వేదాంత, హిందుస్తాన్ కాపర్, వెల్స్పన్ కార్ప్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు ఒక శాతం నుంచి ఆరు శాతం వరకు పడ్డాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ గత నెల రోజుల్లో 9 శాతం పడింది.