తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ కు గురైన అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న గత 10 నెలలు గా జైల్లో ఉన్నాడు.
తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై జనవరి 27న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసినందున నిందితుడు ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. ట్రయల్ కి పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చేరిపేయడానికి ప్రయత్నం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించ వచ్చని చెప్పింది. పాస్ పోర్టు సరెండర్ చేయడం సహా.. ఇతర బెయిల్ షరతులు అన్ని ట్రయల్ కోర్టు ఇస్తుందని ఆదేశాల్లో పేర్కొంది జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం.
Also Read:-రఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..
ఫోన్ ట్యాపింగ్‌లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని సుప్రీంకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్ర దర్యాప్తుకు మరో నాలుగు నెలల సమయం పడుతుందని విచారణ సందర్బంగా కోర్టుకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా. ఆధారాలు, డేటా ధ్వంసం చేశారని, ప్రస్తుతం గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామన్నట్లు చెప్పారు సిద్ధార్థ లూథ్రా. కొంత మంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని తిరుపతన్నకి బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.రాజకీయ నేతల ఆదేశాల మేరకు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు . మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో... కీలక పాత్ర పోషించిన తిరుపతన్న ఆధారాలు చెరిపివేయడంలో కూడా అంతే కీలకంగా ఉన్నారని లూథ్రా వాదించారు.
Also Read :- ఐటీ కంపెనీ ఎదుట నిరుద్యోగుల పరేడ్
2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతన్న పాస్‌పోర్టు వెంటనే సరండర్ చేయాలని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా వాదించారు. ఈ కేసులో కీలకమైన ఇద్దరు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని తెలిపారు లూథ్రా. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు నిందితుడు తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.