
లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది.. మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలు వస్తున్న క్రమంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై సోమవారం ( ఏప్రిల్ 7 ) విచారణ జరిపిన సుప్రీం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదంటూ దేశాలిచ్చింది సుప్రీంకోర్టు. దీంతో మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడ్డట్లయ్యింది.
లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి కూడా వెళ్లారంటూ వార్తలొచ్చాయి... అంతే కాకుండా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేయడంతో అరెస్ట్ ఖాయమన్న వార్తలు మరింత ఊపందుకున్నాయి.
అయితే.. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి.. ఇవాళ ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ మహదేవన్, జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడినఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది.మిథున్ రెడ్డి తరపున అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వి వాదిస్తున్నారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయద్దంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.