పెరుగుతున్న కేసులు..తాత్కాలిక న్యాయమూర్తులు అవసరమా?

పెరుగుతున్న కేసులు..తాత్కాలిక న్యాయమూర్తులు అవసరమా?

మన దేశంలో కేసుల సంఖ్య అధికం. రోజురోజుకీ కోర్టుల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టులోనే 80వేలకు పైగా కేసులు పెండింగ్​లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే బెయిల్​ కోసం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే పరిస్థితులు మన దేశంలో ఏర్పడినాయి. 

బెయిల్​ దరఖాస్తులు హైకోర్టు, సెషన్స్​ కోర్టుల్లో పరిష్కారం కావాలి.  కానీ,  బెయిల్​ కోసం సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు  వెళ్లే పరిస్థితులూ నెలకొన్నాయి.  గత  సెప్టెంబర్​లో జిల్లా జ్యుడీషియరీ కాన్ఫరెన్స్​లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ‘వాయిదాల సంస్కృతి’ని  కోర్టులు వదలాలని అన్నారు.

30 సంవత్సరాలకు పైబడిన కేసుల సంఖ్య 62వేలు.  ఇది దేశంలోని వివిధ హైకోర్టుల పరిస్థితి. అందులో మూడు కేసులు 1952 నుంచి పెండింగ్​లో ఉండటం గమనార్హం. 

అధికారిక  డేటా ప్రకారం 1954 నుంచి నాలుగు కేసులు, 1955 నుంచి 9 కేసులు పెండింగ్​లో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కేసులు కోర్టులకు పెను సవాలుగా మారినాయని భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము అన్నారు. ఈ కేసుల విచారణ  ప్రక్రియలోని భాగస్వాములు కేసుల పరిష్కారానికి తగిన మార్గాన్ని  కనుగొనే ప్రయత్నం చేయాలని రాష్ట్రపతి అన్నారు. 

పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తుల  నియామకానికి  సుప్రీంకోర్టు పోయిన వారం అనుమతినిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్​ ఖన్నా,  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్​లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పుని ప్రకటించింది. 

అయితే, ఈ తాత్కాలిక న్యాయమూర్తుల సంఖ్య  ఆ హైకోర్టుకు  మంజూరైన  న్యాయమూర్తుల సంఖ్యలో 10శాతానికి మించకూడదు. ఈ తాత్కాలికి న్యాయమూర్తులు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కూర్చొని విచారణలో ఉన్న క్రిమినల్​ అప్పీళ్లని పరిష్కరించాలి.

ఆర్టికల్​ 224ఎ  ప్రకారం..

తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్​ 224ఎ  ప్రకారం.. తాత్కాలిక న్యాయమూర్తులను నియమిస్తారు.  రాష్ట్ర  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి పూర్వ అనుమతితో, హైకోర్టు మాజీ న్యాయమూర్తులని ఆ రాష్ట్రానికి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయమని అభ్యర్థించవచ్చు. 

ఆ విధంగా అభ్యర్థించిన వ్యక్తికి  రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా  అధికార పరిధి, జీతభత్యాలను నిర్ధారిస్తారు. అయితే, ఆ విధంగా నియమితులైన న్యాయమూర్తి  ఆ హైకోర్టు న్యాయమూర్తిగా పరిగణించరు.  అంటే, ఆ కేసుల వరకు హైకోర్టు న్యాయమూర్తులే. 

 కానీ, మిగతా విషయాల విషయంలో వాళ్లు హైకోర్టు న్యాయమూర్తులు మాదిరిగా విధులను నిర్వర్తించే అవకాశం ఉండదు.  ఏప్రియల్​ 20, 2021 నాడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి  ఎస్​ఏ  బొబ్డే  నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచి ముందు దాఖలైన  ప్రజాహిత  కేసుని పరిగణనలోకి తీసుకుంటూ ఆ హైకోర్టు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యలో 80శాతం మంది పనిచేస్తూ ఉండాలి లేదా వారి నియామకానికి సిఫారసు చేసి ఉండాలని, అలా ఉన్నప్పుడే ఈ తాత్కాలిక న్యాయమూర్తులను నియమించాలని కోర్టు తేల్చి చెప్పింది. 

సర్వరోగ నివారిణిగా మారకూడదు

సాధారణ  నియామకాలకు సిఫార్సులను చేయడంలోని నిష్ర్కియాత్మకతకు సర్వరోగ నివారిణిగా మారకూడదని బెంచి ఉద్దేశం.  రెగ్యులర్​ న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కొనసాగినప్పుడే ఈ నియామకాలు చేపట్టాలని బెంచి అభిప్రాయం. 

ఈ తాత్కాలిక న్యాయమూర్తులు రెగ్యులర్​ న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేయని ఖాళీలలో 20శాతం కంటే ఎక్కువ ఉండకూడదని బెంచి ఆదేశించింది. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఖన్నా నేతృత్వంలోని బెంచి ఏప్రియల్​ 20, 2021లోని ఉత్తర్వులలోని ఈ భాగాన్ని ఉపసంహరించుకుంది. 

ప్రతి హైకోర్టు 2 నుంచి 5మంది వరకు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవచ్చని అయితే మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యలో 10శాతం మించకూడదని బెంచి ఆదేశించింది.

గతంలో బొబ్డే నేతృత్వంలోని బెంచి ఇచ్చిన మరో ఉత్తర్వుని సుప్రీంకోర్టు నిలిపివేసింది. పాత కేసులను పరిష్కరించేందుకు మాత్రమే డివిజన్​ బెంచిలోని తాత్కాలిక న్యాయమూర్తులతో ఏర్పాటు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించింది. 

ఇప్పుడు తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టు సిట్టింగ్​ జడ్జి నేతృత్వంలోని బెంచిలో కూర్చొని పెండింగ్​లో ఉన్న క్రిమినల్​ అప్పీళ్లను నిర్ణయిస్తారని బెంచి తన ఉత్తర్వులలో ప్రకటించింది.  

364 హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీలు

మన దేశంలో 364 హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నాయి. మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 1,122. ఈ ఖాళీలను పూర్తి చేయకుండా తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం ఎంత వరకు సమంజసమని కొంతమంది అభిప్రాయం. మన న్యాయవ్యవస్థలో పూర్తి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది.  

భర్తీ చేయాల్సిన రెగ్యులర్​ హైకోర్టు న్యాయమూర్తులకు బదులుగా ఈ తాత్కాలిక హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఎంతవరకు సమంజసం?  రెగ్యులర్​ న్యాయమూర్తులని నియమించకుండా ఈ తాత్కాలిక న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అనుకున్న ఫలితాలను ఇవ్వదు. ఇది ఎప్పటికీ ప్రత్యామ్యాయం కాదు. 

ఈ తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు కూడా ఓ సవాలు వంటింది. పదవీ విరమణ తరువాత వేరే నియామకాలను న్యాయమూర్తులు ఆశిస్తారు. అంతేకానీ, మళ్లీ హైకోర్టులో పనిచేసే అవకాశం ఉందని భావించరు. 

రెగ్యులర్​ న్యాయమూర్తులే తమ పరిధులను దాటి ప్రవర్తిస్తున్న సంఘటనలు మనకు ఎన్నో ఇప్పుడు కనిపిస్తున్నాయి. వారిని నియంత్రించే పరిస్థితిలో సుప్రీంకోర్టు లేదు. అలహాబాద్​ హైకోర్టు న్యాయమూర్తి యాదవ్​ తన మాటలకు బహిరంగ క్షమాపణ చెబుతాను అని చెప్పినా కూడా ఆయన చెప్పలేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక న్యాయమూర్తులను ఏవిధంగా నియంత్రించగలరు. న్యాయం జరగడమే కాదు. జరిగినట్టు కూడా అనిపించాలి. 

న్యాయమూర్తుల నియామకంలో జాప్యం

న్యాయమూర్తుల నియామక  ప్రక్రియను నియంత్రించే మెమొరాండం ఆఫ్​ ప్రొసీజర్​ ఈ తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలకు వర్తిస్తుందని బెంచి స్పృష్టం చేసింది. 

తాత్కాలిక న్యాయమూర్తి నియామకం అవసరమైనప్పుడు, ఆ సంబంధింత  మాజీ న్యాయమూర్తి సమ్మతి తీసుకున్న తరువాత  ఆ న్యాయమూర్తి పేరును, అతను పనిచేయాల్సిన కాలాన్ని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి తెలియజేయాల్సి ఉంటుంది. 

ముఖ్యమంత్రి గవర్నర్​తో సంప్రదించి తన సిఫారసుని  కేంద్ర న్యాయ శాఖా మంత్రికి పంపించాలి.  ఆ మంత్రి నిర్దేశించిన విధానం ప్రకారంగా భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి అతని సలహాని స్వీకరించిన తరువాత ప్రధాన మంత్రికి పంపించాలి. 

ఆ తరువాత ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి అతడిని తాత్కాలిక న్యాయమూర్తిగా నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ తరువాత ఎంతో కాలానికిగాని న్యాయమూర్తుల నియామకం జరగడం లేదు. పార్లమెంట్​ ముందు నవంబర్​ 21, 2024నాడు ఉంచిన  సమాచారం ప్రకారం...

గతంలో కూడా తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. 1972లో ఎన్నికల పిటిషన్లను పరిష్కరించడానికి జస్టిస్​ సూరజ్​ఖాన్​ను మధ్యప్రదేశ్​ హైకోర్టులో నియమించారు. 2007లో జస్టిస్ ఓపి శ్రీవాస్తవను అయోధ్య కేసుకు సంబంధించి అలహాబాద్​ హైకోర్టులో నియమించారు.

- డా. మంగారి రాజేందర్,పూర్వ డైరెక్టర్​, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్​ అకాడమీ