కాలుష్యం పెరిగిపోతోంది..పట్టించుకోరేం..ఢిల్లీ సర్కార్పై సుప్రీంకోర్టు ఫైర్

కాలుష్యం పెరిగిపోతోంది..పట్టించుకోరేం..ఢిల్లీ సర్కార్పై సుప్రీంకోర్టు ఫైర్
  • ఢిల్లీ సర్కారును నిలదీసిన సుప్రీంకోర్టు
  • ఏక్యూఐ 300  దాటి పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న
  • ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా నిబంధనలు సడలించొద్దని ఆదేశం
  • ఢిల్లీలో 484 కు చేరిన ఏక్యూఐ.. ‘సివియర్​ ప్లస్​’ కేటగిరీ ప్రకటన
  • ఆరెంజ్​ అలెర్ట్​ జారీ.. జీఆర్ఏపీ స్టేజ్​ 4 ను అమలు చేస్తున్నట్టు వెల్లడి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్నా పట్టించుకోరా? గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ఆప్​ సర్కారుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏక్యూఐ 300 నుంచి 400 మధ్య చేరినప్పుడే స్టేజ్ 3 ఆంక్షలు విధించాల్సిందని, ఈ విషయంలో మూడు రోజులు  ఆలస్యం ఎందుకు ఆలస్యం చేశారని నిలదీసింది. కాలుష్య కట్టడికి కఠినచర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరిగిందని ఢిల్లీ సర్కారుతోపాటు ఎయిర్​ క్వాలిటీ మేనేజ్​మెంట్ కమిషన్​(సీఏక్యూఎం)పై ఫైర్​ అయ్యింది. 

గాలి నాణ్యత అధ్వాన్నంగా మారడంపై ఆందోళన వ్యక్తంచేసింది. ‘సీవియర్ ప్లస్’ కేటగిరీకి పడిపోయిన ఢిల్లీ ఎన్సీఆర్​ పరిధిలో తక్షణమే గ్రేడెడ్​ రెస్పాన్స్​ యాక్షన్​ ప్లాన్​ 4 (జీఆర్​ఏపీ 4) నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. ఏక్యూఐ 450కి దిగువకు వచ్చినా తమకు తెలియజేయకుండా నిబంధనలను సడలించ వద్దని తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్​ అభయ్​ ఎస్​ ఓకా, జస్టిస్​ ఆగస్టిన్​ జార్జ్​మసీహ్​లతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పౌరులందరూ కాలుష్యరహిత వాతావరణంలో జీవించేలా చూడడం అన్ని రాష్ట్రాల రాజ్యాంగ విధి అని పేర్కొన్నది.  

ఫిర్యాదులకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి

ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటిందని, గాలి నాణ్యత సూచీ 450కి దిగువకు వచ్చినా జీఆర్ఏపీ 4 నిబంధనలు అమలు చేయాలని ఆదేశిస్తున్నట్టు బెంచ్​ తెలిపింది. 10,12 తరగతులు మినహా మిగతా క్లాసులకు ఆన్​లైన్​లో తరగతులు నిర్వహించేలా చూడాలని సూచించింది. అలాగే, జీఆర్​ఏపీ 4 నిబంధనలను ఉల్లంఘిస్తే ఫిర్యాదుల చేసేందుకుగానూ ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏక్యూఐ స్థాయి ప్రమాదకర స్థాయికి చేరిన వెంటనే జీఆర్ఏపీ దశలను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నది. 

కాగా,  ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈ నెల 22లోగా అఫిడవిట్​దాఖలు చేయాలని ఢిల్లీ ఎన్సీఆర్ రాష్ట్రాలను ఆదేశించింది. సోమవారం సాయంత్రం నుంచే ఢిల్లీలో జీఆర్ఏపీ 4 నిబంధనలు అమల్లోకి వచ్చాయని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. భారీ వాహనాల  ఎంట్రీపై బ్యాన్ విధించామని తెలిపింది. మరోవైపు, కాలుష్యం, పొగమంచు వల్ల సోమవారం 14 విమానాలను అధికారులు దారి మళ్లించారు.

‘సివియర్​ప్లస్​’ కేటగిరీకి గాలి నాణ్యత

ఢిల్లీలో కాలుష్యంతోపాటు పొగమంచు కమ్ముకొని తీవ్రమైన వాతావరణ పరిస్థితి నెలకొన్నది. ఏక్యూఐ 484 కు చేరుకోవడంతో గాలి నాణ్యత ‘సివియర్​ ప్లస్’ కేటగిరీకి చేరుకున్నది. దీంతో అధికారులు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేశారు. పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో 150 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించలేదు. ఆదివారం రాత్రి 457గా నమోదైన ఏక్యూఐ.. ఆ తర్వాత మరింత దిగజారింది. సోమవారం ఉదయం 484కు చేరడంతో అధికారులు ‘సివియర్‌‌ ప్లస్‌‌’  కేటగిరీగా ప్రకటించారు. 

ఏక్యూఐ 450 దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్​మెంట్ కమిషన్  జీఆర్ఏపీ స్టేజ్​4 నిబంధనలను అమలు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. ఢిల్లీలో నగరంలోకి భారీ ట్రక్కులను అనుమతించరు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, పైప్​లైన్స్​, ఇతర పబ్లిక్​ ప్రాజెక్ట్స్​ సహా అన్ని నిర్మాణాలను నిలిపేశారు. ఎన్ఆర్‌‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50%  సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సీఏక్యూఎం సిఫార్సు చేసింది. 10, 12 తరగతులు మినహా మిగతా తరగతుల వారందరికీ ఆన్‌‌లైన్‌‌ క్లాసులు నిర్వహించనున్నారు.

కాలుష్యంపై బీజేపీ రాజకీయాలు: సీఎం ఆతిశి

ఢిల్లీలో వాయు కాలుష్యంపై బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని సీఎం ఆతిశి మండిపడ్డారు. ఎయిర్​ పొల్యూషన్​ తీవ్రస్థాయికి చేరేవరకూ కేంద్రం చూస్తూ ఉన్నదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఢిల్లీకి పొరుగునే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, రాజస్థాన్​, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్​లో వ్యవసాయ వ్యర్థాలు దహనం చేస్తున్నా.. కేంద్ర చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

సుప్రీంకోర్టు ఆవరణలోనే 11 నిర్మాణాలు.. షాక్​ అయిన బెంచ్​

ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. ఢిల్లీలో నిర్మాణాల బ్యాన్​పై బెంచ్​ ప్రశ్నించగా.. సుప్రీంకోర్టు ఆవరణలోనే భారీ నిర్మాణాలు జరుగుతు న్నాయని లాయర్​ చెప్పారు. దీంతో బెంచ్​ షాక్​కు గురైంది.  భారీ నిర్మాణాలు, కూల్చివేతలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు?  సైట్​కి వెళ్లి ఎవరైనా చెక్​ చేస్తున్నారా? అని జస్టిస్​ ఓకా అడిగారు. దీనిపై సీనియర్​ అడ్వకేట్​ గోపాల్ శంకరనారాయణ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఆవరణలోనే 11 నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో షాక్​కు గురైన జస్టిస్​ ఓకా.. వెంటనే సెక్రటరీ జనరల్​ను కోర్టుకు రమ్మనండి అంటూ ఆదేశించారు.