న్యూఢిల్లీ: ఢిల్లీలో ఫైర్‌క్రాకర్స్ అమ్మకాలు, కొనుగోలు, కాల్చడంపై ఏడాది పొడవునా బ్యాన్ విధించే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంపై ఈ నెల 25 లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకూ పెరిగిపోతుండటంపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఫైర్‌క్రాకర్స్ ఇలాగే పేలుస్తూ, పొల్యూషన్ పెంచుతూ పోతే ఆరోగ్యంగా జీవించేందుకు పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది.
టపాసుల అమ్మకాలు, వాటిని కాల్చడాన్ని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదని తెలిపింది. ఫైర్‌క్రాకర్స్ బ్యాన్ అమలుపై అఫిడవిట్ సమర్పించాలని గత విచారణలో సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. దీంతో ఢిల్లీ పోలీసులు సోమవారం కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. "ఢిల్లీలో ఫైర్‌క్రాకర్స్ శాశ్వత నిషేధంపై ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలి. కాలుష్యాన్ని సృష్టించే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదు. ఇలాగే టపాసులు పేలిస్తే పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్టే అవుతుంది. రా మెటీరియల్ సీజ్ చేసి కంటి తుడుపు చర్యలకు పాల్పడ్డారు. ఫైర్‌క్రాకర్స్ అమ్మినవారిపై, కొని కాల్చిన వారిపై ఎలాంటి జరిమానాలు విధించలేదు.
ఇలా అయితే బాణసంచా నిషేధం ఎలా అమలు అవుతుంది. బ్యాన్ గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగేలా చర్యలు తీసుకోండి. ఫైర్‌క్రాకర్స్‌పై శాశ్వత నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి" అని ఢిల్లీ సర్కారుకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన బెంచ్ స్పష్టంచేసింది. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై గత విచారణలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.."టపాసులపై నిషేధం అమలు చేయలేదని వార్తలు వచ్చాయి. కాలుష్య నివారణకు చర్యలు తీసుకున్నారా లేదా..?" అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. నిషేధాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు అవసరమని వ్యాఖ్యానించింది. 2025 దీపావళికైనా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చర్యలు ఉండాలని సూచించింది.