- 75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ నడిపేందుకు అర్హులు
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్ కు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్లు కూడా కమర్షియల్ వెహికల్ నడపవచ్చని తెలిపింది. అయితే 75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్ పోర్టు వెహికల్స్ ను నడపడానికి మాత్రమే అర్హులని చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2017లో జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ఇదీ కేసు..
గతంలో ముకుంద్ దేవాంగన్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ యూయూ లలిత్ బెంచ్.. 75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్ పోర్టు వెహికల్స్ ఎల్ఎంవీల పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. అయితే ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు కమర్షియల్ వెహికల్స్ నడుపుతుండడంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అలాంటి కేసుల్లో నష్టపరిహారం చెల్లించబోమని ఇన్సూరెన్స్ కంపెనీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
జస్టిస్ యూయూ లలిత్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 76 పిటిషన్లు ఫైల్ చేశాయి. వీటిపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. ఈ ఏడాది ఆగస్టు 21న తీర్పు రిజర్వ్ చేసింది. ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు.. 75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్ పోర్టు వెహికల్స్ నడపవచ్చని ఇప్పుడు తీర్పు ఇచ్చింది.
ట్రాన్స్ పోర్టు వెహికల్స్ నడుపుతున్న ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్ల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పడానికి పిటిషనర్లు ఎలాంటి డేటా అందజేయలేదని పేర్కొంది. తాము ఇచ్చిన ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ లో సవరణలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.