అమరావతి: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణను త్వరగా ప్రారంభించాలని సీబీఐ కోర్టుకు సూచించింది. వీలైనంత త్వరగా విచారణను పూర్తిచేయాలని స్పష్టం చేసింది. విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది.
జగన్ కేసులను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయడంతో పాటు ఆయన బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. రఘురామ తరఫు అడ్వకేట్ శ్రీరామ్ వాదిస్తూ.. కేసులు నమోదు అయినప్పటి నుంచి ఇప్పటికే ఆరుగురు పదవీ విరమణ లేదా బదిలీ అయ్యారని కోర్టుకు తెలిపారు.
విచారణను ఆలస్యం చేసేందుకే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. కేసు ఏండ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్‌లో ఉందని.. త్వరగా పరిష్కరించాలని కోరారు. దీనిపై బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ కోర్టు ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించింది. ఈ కేసును త్వరగా విచారించాలని తెలిపింది.