అజారుద్దీన్​కు సుప్రీంకోర్టు నోటీసులు

అజారుద్దీన్​కు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందిన తన ప్రత్యర్థి మాగంటి గోపీనాథ్ ఎన్నికను రద్దు చేయాలని అజారుద్దీన్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కొట్టివేయాలని గోపీనాథ్ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా గోపీనాథ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. 

దీన్ని సవాల్ చేస్తూ గోపీనాథ్ ఈ నెల 6న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో జరుగుతోన్న విచారణపై స్టే విధించింది. అలాగే ప్రతివాదిగా ఉన్న అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.