అతుల్ సుభాష్ పరిస్థితి మరొకరికి రాకూడదని.. సుప్రీం కోర్టు 8 మార్గదర్శకాలివే..

న్యూఢిల్లీ: విడాకుల కేసుల్లో న్యాయ స్థానాలు కొన్ని మార్గదర్శకాల ఆధారంగా భరణం నిర్ణయించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సూచించింది. భార్య వేధింపుల కారణంగా బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సందర్భంలో సుప్రీం కోర్టు ఈ మార్గదర్శకాలను సూచించడం గమనార్హం.

రూ.3 కోట్లు భరణం చెల్లించాలని తన భార్య నిఖిత సింఘానియా అడిగిందని, ఆమె సంరక్షణలో ఉన్న తన కొడుకును కలవడానికి రూ.30 లక్షలు డిమాండ్ చేసిందని తన 24 పేజీల సూసైడ్ నోట్లో అతుల్ సుభాష్ ప్రస్తావించాడు. ఈ క్రమంలో భరణానికి సంబంధించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలు రావడం చర్చనీయాంశమైంది.

భరణం నిర్ణయించే విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు:
1. భర్త, భార్య కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు
2. విడాకులు కోరుతున్న భార్య, భర్త విద్యార్హత, ఉద్యోగం తీరుతెన్నులు
3. భార్య, ఆమెపై ఆధారపడిన పిల్లల అవసరాలు
4. విడాకులు కోరిన భార్యాభర్తల వ్యక్తిగత ఆదాయం, వ్యక్తిగత ఆస్తులు
5. అత్తింట్లో భార్య గడిపిన జీవితం తాలూకూ స్థితిగతులు
6. కుటుంబ సంరక్షణ కోసం భార్య ఉద్యోగాన్ని వదిలేసిందా..?
7. ఉద్యోగం చేసే స్థితిలో లేని భార్యకు విడాకుల సమయంలో న్యాయ పోరాటానికి తగిన మొత్తాన్ని భరించడం
8. భర్త ఆర్థిక పరిస్థితి, అతని ఆదాయం, అప్పులు, మెయింటెనెన్స్ బాధ్యతలు

Also Read : బెంగళూరు నుంచి యూపీకి 40 సార్లు తిప్పించింది.. అతుల్ సుభాష్ కుటుంబ సభ్యుల ఆవేదన

పైన పేర్కొన్న ఈ ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకుని విడాకుల సమయంలో భరణం చెల్లించాలా..? చెల్లించాల్సిన అవసరం లేదా..? అనే అంశంలో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలకు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేతో కూడిన ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీం కోర్టులో ఒక విడాకుల కేసులో విచారణ జరిగిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. 

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆ భార్యాభర్తలు పెళ్లైన ఆరేళ్లు కలిసి జీవించారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. ఈ భార్యాభర్త విడాకులు కోరారు. భరణం విషయంలో వివాదం తలెత్తడంతో అత్యున్నత ధర్మాసనం భరణం గురించి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. శాశ్వత భరణం నిర్ణయించే సందర్భంలో న్యాయ స్థానాలు ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అతుల్ ఆత్మహత్యకు కారణమైన అతని భార్య, ఆమె బంధువులపై కేసులు నమోదు అయ్యాయి. అతుల్ తన సూసైడ్ నోట్ రాసిన విషయాలు వెల్లడి కావడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి కూడా అతుల్ లేఖ రాశాడు. సోషల్ మీడియాలో అతుల్ సూసైడ్ నోట్, వీడియో వైరల్ కావడంతో అతనికి నెటిజన్లు మద్దుతుగా నిలిచారు.