
- ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ట్రిబ్యునల్ వాదనల్లో పాల్గొనాలని ఆదేశం
- కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకుకొత్త అడ్వకేట్‌ను నియమించిన ఏపీ
- కేసును స్టడీ చేసేందుకు కొంత టైమ్ కావాలన్న కొత్త అడ్వకేట్.. ఇంకెంత టైమ్ కావాలంటూ కోర్టు అసంతృప్తి
- రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
- లాయర్లతో కలిసి విచారణకు హాజరు
హైదరాబాద్, వెలుగు : కృష్ణా జలాల వివాదంపై కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్–2 (కేడబ్ల్యూడీటీ 2/ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్)లో వాదనలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల గంపగుత్త కేటాయింపుల్లో రాష్ట్రాల వాటా తేల్చే అంశంపై ట్రిబ్యునల్‌లో జరగాల్సిన వాదనలను వాయిదా వేయాలని ఏపీ కోరగా.. కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే ట్రిబ్యునల్ డిసైడ్ అయిన నేపథ్యంలో వాదనలను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.
రాష్ట్రాల గంపగుత్త కేటాయింపుల్లో వాటాలను తేల్చేందుకు 2023 అక్టోబర్ 6న సెక్షన్ 3లో ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను జోడిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ను కొట్టేయాలని అదే ఏడాది అక్టోబర్ 17న సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ తో కూడిన బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ వాదిస్తూ.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ లో ఈ నెల 19 నుంచి జరగాల్సిన వాదనలను వాయిదా వేయాలని కోరింది. దీనిపై స్పందించిన బెంచ్.. ప్రస్తుత పరిస్థితుల్లో వాదనలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది.
ట్రిబ్యునల్‌లో ఇలాంటి వాదనలకు ఎక్కువ టైమ్ పట్టే అవకాశం ఉన్నందున, వాదనల్లో పాల్గొనాలని ఏపీకి స్పష్టం చేసింది. జనవరిలో ట్రిబ్యునల్‌లో సమర్పించిన రెండు రాష్ట్రాల వాదనలను తమకు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. 25న రెండు రాష్ట్రాలు ఈ కేసుకు సంబంధించిన షార్ట్ నోట్స్ సమర్పించాలని ఆదేశించింది.
అది అల్లాటప్పా గెజిట్ కాదు : తెలంగాణ
కోర్టులో ఏపీ వాదనలకు తెలంగాణ గట్టి కౌంటర్ ఇచ్చింది. సెక్షన్ 3లో ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కేంద్రం అల్లాటప్పాగా ఏమీ తేలేదని తెలంగాణ తరఫు అడ్వకేట్లు వాదించారు. ఏదో నార్మల్‌గా సెక్రటరీ స్థాయిలో ఇచ్చిన ఆర్డర్స్ కావని తేల్చి చెప్పారు. కేంద్ర కేబినెట్‌లో అన్ని అంశాలపై చర్చించిన తర్వాతే గెజిట్ ఇచ్చారని, దానికి సాంక్టిటీ ఉంటుందని, గెజిట్‌ను ప్రశ్నించడానికి వీల్లేదన్నారు.
ట్రిబ్యునల్‌లో మరో ఏడాది పాటు వాదనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రతిసారీ ఏపీ అడ్వకేట్‌ను మారుస్తుండడంతో వాదనలు లేట్ అయ్యే అవకాశం ఉంటుందని వాదించారు. విచారణ పురోగతిలో ఉంటున్న టైమ్‌లోనే ఏపీ లాయర్‌ను మారుస్తూ విచారణని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టులో విచారణకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్లు వైద్యనాథన్, గోపాల్ శంకర్, ఈఎన్‌సీ ఓఅండ్ ఎం విజయ్ భాస్కర్ రెడ్డి, ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ ఎస్‌ఈ విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
విచారణను లేట్ చేసేందుకు ఏపీ ఎత్తులు..
విచారణను మరింత లేట్ చేయాలన్న ఉద్దేశంతో ఏపీ కొత్తగా మరో అడ్వకేట్‌ను అపాయింట్ చేసింది. ఇప్పటికే జయదీప్ గుప్తా ఏపీ తరఫున వాదనలు వినిపిస్తుండగా.. అదనంగా సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని నియమించింది. ఇప్పుడే ఈ కేసులో తాను ఇన్వాల్వ్ అయినందున.. కేసును క్షుణ్నంగా పరిశీలించేందుకు కొంత టైమ్ కావాలని, మరికొన్నాళ్లూ వాయిదా వేయాలని కోర్టును కోరారు.
Also Read :- 500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్ : సీఎం రేవంత్‌రెడ్డి
దీనిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంకెంత టైమ్ కావాలని నిలదీసింది. కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు రెండు గంటల కన్నా ఎక్కువ టైమ్ పడుతుందా? అని ప్రశ్నించింది. ట్రిబ్యునల్ లో వాదనలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది.
తెలంగాణ హక్కులు కాపాడతాం : మంత్రి ఉత్తమ్
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతామని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోర్టు విచారణ అనంతరం ఢిల్లీలో మీడియాతో ఆయన మట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 19 నుంచి జరగాల్సిన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వాదనలకు సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచిందని, ఇది రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగు అని పేర్కొన్నారు.