పాకిస్తానీ అని పిలవడం నేరం కాదు: సుప్రీంకోర్టు

పాకిస్తానీ అని  పిలవడం నేరం కాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎవరినైనా పాకిస్తానీ, మియాన్–టియాన్ వంటి పేర్లతో పిలవడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే నేరం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జార్ఖండ్​రాష్ట్రం చాస్ సబ్ డివిజనల్ ఆఫీసులో ఉర్దూ ట్రాన్స్​లేటర్, రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) యాక్టింగ్ క్లర్క్ దాఖలు చేసిన క్రిమినల్ కేసులో జస్టిస్ బీవీ నాగరత్న, సతీశ్ చంద్ర శర్మలతో కూడిన డివిజన్​బెంచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీఐ కార్యకర్తను నిర్దోషిగా ప్రకటించింది. 

ఈ అప్పీల్​పై ఫిబ్రవరి 11న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ‘‘ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చిన తనను ‘పాకిస్తానీ’.. ‘మియాన్–టియాన్’ అని పిలవడం ద్వారా మతపరమైన భావాలను దెబ్బతీశాడని ఉర్దూ ట్రాన్స్​లేటర్ ఆరోపించారు. అయితే అది చాలా పేలవమైన స్టేట్​మెంట్ అనడంలో సందేహం లేదు. అది మతపరమైన మనోభావాలను దెబ్బతీసేంత పెద్ద నేరం కాదు. అందువల్ల, ఐపీసీ సెక్షన్ 298 కింద చేసిన అప్పీల్​ను డిశ్చార్జ్ చేస్తున్నం” అని పేర్కొంది.