సుప్రీంకోర్టు అధికారాలు ఏంటి.?

సుప్రీంకోర్టు అధికారాలు ఏంటి.?

భారత న్యాయ వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు రాజకీయ వ్యవస్థ మాదిరిగా అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన చేయలేదు. ఏకీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ రాష్ట్ర స్థాయిలోని హైకోర్టులతో సహా అన్ని స్థాయిల్లోని దిగువ కోర్టులపై ఆధిక్యాన్ని కలిగి ఉన్నది. హైకోర్టులు కింది కోర్టులపై పర్యవేక్షణ, నియంత్రణా అధికారాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల మనదేశ న్యాయవ్యవస్థ సమీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడంలో ప్రభుత్వ శాఖలన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయడంలో న్యాయశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికన్ సుప్రీంకోర్టుతో సహా ప్రపంచంలోని ఇతర దేశాల అత్యున్నత న్యాయస్థానాల కంటే కూడా భారత అత్యున్నత న్యాయస్థానం విస్తృతమైన అధికారాలను కలిగి ఉన్నది.

ఒరిజినల్ అధికారాలు

రాజ్యాంగంలోని 131వ అధికరణ సుప్రీంకోర్టు ఒరిజినల్(ప్రారంభ) అధికారాలను తెలుపుతుంది. అంటే కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారించడానికి అవకాశం ఉన్న అంశాలు ఇందులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాలకు, రాష్ట్రాలకూ రాష్ట్రాలకూ మధ్య తలెత్తే వివాదాలను విచారిస్తుంది. కేంద్రం ఒక వైపు, కొన్ని రాష్ట్రాలు మరోవైపు ఉన్నప్పుడు వాటి మధ్యగల సమస్యలను పరిష్కరిస్తుంది. ఏవైనా రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అంశాలను విచారిస్తుంది. ఈ అంశాలు ప్రధానంగా సమాఖ్య విధానానికి సంబంధించిన అంశాలు. ఈ విషయమై తలెత్తే వివాదాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ అయిన సుప్రీంకోర్టు విచారిస్తుంది. 1967లో పశ్చిమబెంగాల్, భారత ప్రభుత్వం మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు మొదటిసారిగా ఈ అధికారాలను వినియోగించింది.

అప్పీళ్ల విచారణ అధికారాలు

సుప్రీంకోర్టుకు దిగువన ఉండే రాష్ట్రాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పుల పట్ల సంతృప్తి చెందనివారు, అదేవిధంగా తమకు న్యాయం జరగలేదని భావించినప్పుడు హైకోర్టు తీర్పులపై దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లను స్వీకరించి విచారించి అంతిమ తీర్పులను ఇచ్చే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. అప్పీళ్లు ప్రధానంగా నాలుగు రకాలు.

రాజ్యాంగబద్ధమైన అప్పీళ్లు: 132వ అధికరణ రాజ్యాంగబద్ధ అప్పీళ్ల గురించి పేర్కొంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు వాటిని సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. 

సివిల్ అప్పీళ్లు: 133వ అధికరణ సివిల్​అప్పీళ్లకు సంబంధించి అంశాలను వివరిస్తుంది. సాధారణంగా సివిల్ అప్పీళ్లు అనేవి ఆస్తికి సంబంధించిన వివాదాలపై చేసే అప్పీళ్లుగా ఉంటాయి. ఆస్తి వివాదం కనీసం రూ.20వేల కంటే ఎక్కువ విలువ కలిగి ఉండాలి. ఆస్తి వివాదంలో చట్టబద్ధత ఇమిడి ఉండాలి లేదా సుప్రీంకోర్టు వివరణ అవసరమని హైకోర్టు భావించాలి. 30వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆస్తి విలువపై గల పరిమితిని తొలగించారు. కానీ 134– ఏ ప్రకారం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటే హైకోర్టు అనుమతిని తప్పనిసరి చేశారు. 

క్రిమినల్ అప్పీళ్లు: 134వ అధికరణ క్రిమినల్ అప్పీళ్లను గురించి తెలుపుతుంది. ఇవి సాధారణంగా నేరాలకు సంబంధించిన అప్పీళ్లుగా ఉంటాయి. హైకోర్టులు వివిధ క్రిమినల్ కేసుల్లో  ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీళ్లు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో హైకోర్టు అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

జిల్లా సెషన్స్ కోర్టు ఏదైనా కేసులో నిందితుడిని నిర్దోషిగా తీర్పునిచ్చిన తర్వాత అదే కేసును హైకోర్టు విచారించి నిందితుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించినప్పుడు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరుపుతున్న కేసును హైకోర్టు తనకు బదిలీ చేయించుకుని ఆ కేసులో ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించినప్పుడు 1970లో సవరించిన చట్టాన్ని అనుసరించి హైకోర్టులు 1‌‌0 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం శిక్ష విధించినప్పుడు కూడా ఉన్నత న్యాయస్థానంలో నేరుగా అప్పీళ్లు చేసుకోవచ్చు.

ప్రత్యేకమైన అప్పీళ్లు

136వ అధికరణ సుప్రీంకోర్టు ప్రత్యేక అప్పీళ్ల విచారణ పరిధిని తెలియజేస్తుంది. హైకోర్టులు 134(ఏ) అధికరణ ప్రకారం తామిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీలుకు అనుమతి పత్రాన్ని జారీ చేస్తుంది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి హైకోర్టులో అవకాశం కల్పించని, అనుమతివ్వని కేసుల్లో ప్రత్యేక అప్పీళ్లకు ప్రయత్నిస్తారు. సంబంధిత కేసుల్లో ఏదైనా న్యాయపరమైన ప్రత్యేక అంశం ఇమిడి ఉన్నప్పుడు అదేవిధంగా హైకోర్టు ఏదైనా అంశాన్ని పరిగణనలోకి తీసుకోని సందర్భంలో సుప్రీంకోర్టు ప్రత్యేక అప్పీలుకు అవకాశం కల్పిస్తుంది. సుప్రీంకోర్టులో ఉండే స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ప్రత్యేక అప్పీలుకు అనుమతిస్తుంది. 

కోర్ట్ ఆఫ్ ​రికార్డ్

129వ అధికరణ సుప్రీంకోర్టు కోర్టు ఆఫ్ రికార్డు అధికార పరిధిని తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డు రూపంలో భద్రపర్చడాన్నే కోర్ట్ ఆఫ్​ రికార్డు అంటారు. వీటినే అనుపూర్వికాలు అని కూడా అంటారు. కోర్టుకు సమర్పించిన రికార్డులు, డాక్యుమెంట్లు, కోర్టు ముందు ప్రమాణ పూర్తిగా ఇచ్చిన సాక్ష్యాధారాలను కోర్ట్ ఆఫ్ రికార్డులో భాగంగా పరిగణిస్తారు. అనుపూర్వికాలు సాధారణ చట్టాలుగానే చలామణి అవుతాయి. వీటిని ధిక్కరించిన వారిపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు తీసుకోవచ్చు. 

రిట్లను జారీ చేయడం

రాజ్యాంగం ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పగించింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చని ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల అమలు కోసం, సంరక్షణ కోసం హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియరీ, ప్రొహిబిషన్, కోవారెంటో వంటి రిట్లను జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు రిట్ల జారీపై పార్లమెంట్ చట్టబద్ధంగా పరిమితులు విధించవచ్చు. పార్లమెంట్ విధించిన పరిమితుల్లోని న్యాయబద్ధతను సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు. 

సలహారూపక అధికారాలు

143వ అధికరణ సుప్రీంకోర్టు సలహారూపక అధికార పరిధిని వివరిస్తుంది. భారత రాజ్యాంగ అధిపతిగా వ్యవహరించే రాష్ట్రపతి పరిపాలనపరమైన సమస్యలు తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు న్యాయ సలహాలను కోరవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా తమ సలహాలను భారత రాష్ట్రపతికి తెలిపే అధికారాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రపతి ప్రధానంగా మూడు రకాలైన అంశాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరవచ్చు. 

రాజ్యాంగబద్ధమైన విషయాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టులో న్యాయసలహాను కోరినప్పుడు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులకు తగ్గకుండా ఉండే ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు. అటార్నీ జనరల్ సదరు అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తన వాదన వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రూపంలో తన సలహాను కోర్టు హాల్ లోనే వెల్లడిస్తుంది. రాజ్యాంగబద్ధమైన విషయాల్లో సుప్రీంకోర్టు రాష్ట్రపతికి తప్పనిసరిగా తన న్యాయ సలహాలను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రపతి అంటే ప్రభుత్వం కూడా తప్పనిసరిగా సుప్రీంకోర్టు సలహాలను పాటించాల్సి ఉంటుంది.

శాసన సంబంధమైన అంశాలు

 పరిపాలనా సంబంధమైన అంశాలు.చట్టాలకు, పరిపాలనకు సంబంధించి రాజ్యాంగ బద్ధత ఇమిడి ఉన్న అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాలను కోరవచ్చు. రాష్ట్రపతి కోరిన సలహాపై సుప్రీంకోర్టు తప్పనిసరిగా తన అభిప్రాయాన్ని తెలపాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు తన సలహాలను బహిరంగ కోర్టులో తీర్పు ద్వారానే  తెలపాలి.  1953లో ఢిల్లీ పరిపాలక చట్టాల అంశంపై మొదటిసారిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరారు. ఇప్పటివరకు 15 సార్లు ఇలాంటి న్యాయ సలహాను కోరారు. ఇటీవల పంజాబ్‌ ప్రభుత్వం రద్దు చేసిన నీటి ఒప్పందాల విషయమై రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉన్నది.