చటాన్​పల్లి ఎన్‌కౌంటర్ కోర్టు మెట్లెక్కింది

చటాన్​పల్లి ఎన్‌కౌంటర్ కోర్టు మెట్లెక్కింది

ఎన్​కౌంటర్​కు ప్రజలు ఒక్క గొంతుతో మద్దతివ్వడం గతంలో ఎన్నడూ లేదు.  దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్ విషయంలో ప్రజలు, ప్రభుత్వ నేతలు, రాజకీయ నాయకులు.. అందరి నుంచి  దిశకు న్యాయం జరిగిందన్న వాదన వినిపించింది. పబ్లిక్​ సెంటిమెంట్​తో ముడిపడిన ఈ ఎన్​కౌంటర్​లో  తాజాగా సుప్రీంకోర్టు కలుగజేసుకోవడం సంచలనంగా మారింది.

దేశంలో ఏదైనా ఎన్​కౌంటర్ జరిగితే అది నిజమైన ఎన్​కౌంటరా, ఫేక్ ఎన్​కౌంటరా అన్న విషయంపై దర్యాప్తు జరగడం కొత్తేం కాదు. సంఘటన జరిగిన తీరు, సందర్భాన్ని బట్టి దానిపై విస్తృతంగా చర్చించడం, కోర్టుల్లో పిటిషన్లు వేయడం ఎప్పుడూ జరిగేదే. ఒక ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఎన్​కౌంటర్లు జరిగినప్పుడు పౌరహక్కుల సంఘాలు దర్యాప్తు కోరుతుంటాయి. కోర్టుల్లో పిటిషన్లు వేసి నిజాలు తేల్చాలని అడుగుతాయి. మరోవైపు రౌడీలు, గూండాలు, మాఫియా లీడర్లు, ల్యాండ్ గ్రాబర్లు లాంటి క్రిమినల్స్ ని ఎన్​కౌంటర్ చేసినప్పుడు మరో రకమైన పరిస్థితి కనిపిస్తుంది. మానవహక్కుల కమిషన్ కు ఉన్న అధికార పరిధిని బట్టి అవి ఇలాంటి కేసులను సుమోటోగా తీసుకునే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తులు ఎలాంటివాళ్లయినా వాళ్లు కాల్పుల్లో చనిపోయిన తీరుపై అనుమానాలు ఉంటే హక్కుల కమిషన్ విచారణ జరుపుతుంది. ఇలా విచారించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు అనుమానాస్పదంగాగానీ, ఎన్​కౌంటర్​లోగానీ చనిపోయినప్పుడు సహజంగానే రకరకాల అనుమానాలు వస్తుంటాయి. దీంతో ఇలాంటి కేసుల్లో హక్కుల ఉల్లంఘన జరిగిందా లేదా అన్న అంశంపై విచారణ జరుపుతారు. మరోవైపు పలు సంస్థల పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోనూ విచారణలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్ వ్యవహారంలో తలెత్తింది. దారుణ అత్యాచారం, హత్యకు పాల్పడ్డ నిందితులపై జనంలో ఆగ్రహం వెల్లువెత్తింది. నిర్భయ ఘటన తర్వాత అదే స్థాయిలో మళ్లీ దేశ వ్యాప్తంగా జనం రోడ్ల మీదికి వచ్చారు. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి టైంలో నిందితులు నలుగురూ ఎన్​కౌంటర్​లో హతమవడాన్ని జనమంతా సమర్థించారు. దీంతో ఎన్​కౌంటర్ జరిగిన తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) విచారణ జరపడాన్ని జనంతో పాటు ప్రభుత్వాల్ని నడిపించే స్థాయి నేతలు కూడా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలా పబ్లిక్ సెంటిమెంట్ తో ముడిపడిన సంఘటనల్లో ఎన్​కౌంటర్లపై సుప్రీంకోర్టు వరకు విచారణ పోయిన సందర్భాలు దాదాపు లేవంటున్నారు సీనియర్ అడ్వొకేట్లు. గతంలో ఎన్​కౌంటర్లపై జనం నుంచి కూడా విమర్శలు వచ్చేవి. దిశ సంఘటనలో ఎన్​కౌంటర్ జరిగిన తీరు కంటే ఆమెకు న్యాయం జరిగిందన్న భావన జనంలో బలంగా కనిపించింది. సోషల్ మీడియాలో, నేరుగా పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో గతంలో ఎన్ కౌంటర్లపై పెద్దగా స్పందించనివాళ్లు కూడా ఇప్పుడు దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ పై ఏం జరుగుతోందన్న ఆసక్తి చూపిస్తున్నారు.

రిటైర్డ్ జడ్జితో కమిటీ

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​  తర్వాత ఎప్పటిలాగే ఎన్ హెచ్చార్సీ స్పందించింది. ఈ సంఘటనను సుమోటోగా తీసుకొని రాష్ట్ర పోలీసులకి నోటీసులిచ్చింది. హెచ్చార్సీ పంపిన టీమ్ హైదరాబాద్ వచ్చి నాలుగు రోజుల పాటు విచారణ చేసింది. ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, అందులో ఉన్న పోలీసుల్ని విచారించింది. ఇదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తు జరిపి రిపోర్టివ్వాలని కేంద్ర హోంశాఖ కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఎన్​కౌంటర్​ పై నిజానిజాలు తేల్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, 2014నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని పాటించలేదంటూ వచ్చిన వరుస పిటిషన్లను సుప్రీం విచారణకు తీసుకుంది. ఎన్​కౌంటర్​పై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించే ప్రతిపాదనను బెంచ్ చేసింది. దీనిపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పి.వి.రెడ్డిని కోరితే ఆయన సిద్ధంగా లేరని సుప్రీం చెప్పింది. దీంతో ఇతర రిటైర్డ్ జడ్జీల పేర్లు సూచించాలని పిటిషనర్లని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

విచారణ కొత్తేం కాదు

ఎన్​కౌంటర్లలో పాల్గొన్న పోలీసులు న్యాయ విచారణను ఎదుర్కోవడం కొత్తేం కాదు. అయితే ఒకే ఎన్ కౌంటర్ పై ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో విచారణ జరగడం, రిటైర్డ్ జడ్జీతో విచారించే ప్రతిపాదన చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదంటున్నారు న్యాయనిపుణులు. గతంలో ఎన్​కౌంటర్లు జరిగితే పోలీసులు కేసు నమోదు చేయడం, ప్రభుత్వాలు సిట్ తో దర్యాప్తు జరపడం, హెచ్చార్సీ విచారణ సహజంగానే జరిగేవి. దిశ కేసులో సుప్రీం రిటైర్డ్ జడ్జితో విచారించే ప్రతిపాదనే కొత్తకోణం అంటున్నారు న్యాయనిపుణులు.

మహారాష్ట్రలో ..

ముంబయిలో ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించడంపై యశ్వంత్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో 2018లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిర్దోషి అని తెలిసినా పోలీసులు ఒక వ్యక్తిని ఓ కేసులో తీసుకెళ్లి హింసించి, కొట్టడంతో పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు. దాన్ని కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో ఆ స్టేషన్లోని పోలీసులనందరినీ బాధ్యులుగా పేర్కొంటూ కింది కోర్టు వేసిన మూడేళ్ల శిక్షను ఏడేళ్లకు పెంచింది. అలాంటి కేసుల్లో పోలీసులు ఏమీ మినహాయింపు కాదన్న సందేశాన్ని బలంగా పంపింది సుప్రీంకోర్టు.

‑  సంపత్​. గంగ

13 ఏళ్ల సోహ్రబుద్దీన్ కేసు

గుజరాత్, రాజస్థాన్ లలో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న సోహ్రబుద్దీన్‌ను పోలీసులు 2005 నవంబరులో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇది వివాదం కావడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. సోహ్రబుద్దీన్ ది నకిలీ ఎన్‌కౌంటర్ అని సీబీఐ ఆరోపించింది. అయితే ఈ కేసులో కుట్రకోణాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని, సీబీఐ చూపించిన ఆధారాలు సంతృప్తికరంగా లేవని జడ్జి కొట్టేశారు. దీంతో కేసు వీగిపోయింది. ఈ కేసులో అప్పటి గుజరాత్ డీఐజీ వంజారా సహా చాలామంది సీనియర్ అధికారులు నిందితులుగా ఉన్నారు. ఇది నకిలీ ఎన్ కౌంటర్ కాదనీ, ఆత్మరక్షణ కోసమే డ్యూటీలో భాగంగానే షూట్ చేశామని పోలీసులు చెప్పారు. సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ బస్సులో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి పోతుండగా మధ్యలో గుజరాత్, రాజస్థాన్ పోలీసులు వారిని దింపేసి తీసుకెళ్లారని సీబీఐ వాదించింది. గుజరాత్ కు తరలించి ఎన్ కౌంటర్లో చంపేశారని ఆరోపించింది. కేసు వీగిపోయిన సమయంలో ‘చనిపోయిన ముగ్గురి కుటుంబాల పట్ల నాకు జాలి కలుగుతోంది. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. తన ముందుకు తీసుకువచ్చిన ఆధారాలను బట్టే న్యాయస్థానం పనిచేస్తుంది. దురదృష్టవశాత్తూ ఈ కేసులో ఆధారాలు లేవు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఎర్రచందనం కేసులో…

తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నారన్న ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2015లో కాల్పులు జరిపారు. నమ్మశక్యంగా లేని దీనిపై తమిళనాడు ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. జాతీయ మానవహక్కుల సంఘం విచారణ చేపట్టింది. కమిషన్ దీనిపై ఇచ్చిన నివేదికలో పోలీసుల చర్యను విమర్శించిందే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయలేదు. ఇప్పటికీ ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  పెండింగులో ఉంది.

చత్తీస్‌గఢ్‌ కాల్పులపై

చత్తీస్‌గఢ్ లో 2012 లో సర్కెగూడలో పోలీసు కాల్పుల్లో మరణించింది మావోయిస్టులు కారని, స్థానిక ఆదివాసీలేనని విచారణ కమిటీ తేల్చింది. ఆ మరణాలు హత్యలేనని కమిటీ నివేదిక చెప్పింది.  మావోయిస్టులు అనుకొని సామాన్య గిరిజనులను కాల్పిచంపినట్లు ఆరపణలు వచ్చాయి. అయితే ఏడేళ్ల కింద జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై విచారణ మాత్రం ఇప్పటివరకు మొదలుకాలేదు.

ఆజాద్ కేసులో …

మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ 2010 జూలై 2న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం సర్కేపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఏకె–47 తో పాటు .9 ఎంఎం పిస్తోలు, కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఎన్ కౌంటర్ పై అనేక అనుమానాలు వచ్చాయి. పౌర హక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. దీంతో కేసును సీబీఐకు అప్పగిస్తూ 2011 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఎన్‌ కౌంటర్ పై దర్యాప్తు జరిపిన సీబీఐ 2012 మార్చిలో సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది.

సుప్రీం గైడ్ లైన్స్

పీయూసీఎల్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో 2014 లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఎన్ కౌంటర్ పై స్వతంత్రంగా దర్యాప్తు జరపాలనీ, సవివరమైన నివేదిక దాఖలు చేసి దాని ఆధా రంగా దోషులపై చర్యలు తీసుకో వాలని స్పష్టం చేసింది.

ఎన్​కౌంటర్​లో చని పోయిన నిందితులు తమ ఆయుధాలు లాక్కు న్నారనీ, తమపై దాడి చేశారని పోలీసులు చెప్తే కోర్టు సులభంగా నమ్మరాదని చెప్పింది. సరైన రీతిలో దర్యాప్తు చేయాలనీ, అవసరమైన నేర విచారణ జరపాలని ఆదేశించింది.

దిశ కేసు లో నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత కూడా సుప్రీం గైడ్ లైన్స్ ను పోలీసులు పాటించారా లేదా అన్న పాయింట్ ఆధారంగానే పిటిషన్ ను విచారణకు తీసుకుంది.