
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి ఫ్రీడం ఫైటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని, మరోసారి అలాంటి కామెంట్లు చేస్తే సుమోటోగా తీసుకుంటామని హెచ్చరించింది. 2022 నవంబరు 17న భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సావర్కర్ పెన్షన్ తీసుకున్నారని, ఆయన బ్రిటిష్ సర్వెంట్ అని వ్యాఖ్యానించారు.
రాహుల్ వ్యాఖ్యలను తప్పుపడుతూ నృపేంద్ర పాండ్య అనే అడ్వకేట్.. అలహాబాద్ హైకోర్టులో ఆయనపై కేసు వేశారు. సావర్కర్‌ను ఉద్దేశపూర్వకంగానే రాహుల్ అవమానించారని, సావర్కర్ ప్రతిష్టకు భంగం కలిగించే కుట్రలో భాగంగానే రాహుల్ వ్యాఖ్యలు ఉన్నట్లు తెలుస్తున్నదని పాండ్య పేర్కొన్నారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రాహుల్ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ తో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
రాహుల్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం తన క్లైంట్ ఉద్దేశం కాదన్నారు. బెంచ్ స్పందిస్తూ.. ‘‘సావర్కర్ ను ‘మీ నమ్మకమైన సేవకుడు’ అంటూ మహాత్మా గాంధీ వాడిన పదం మీ క్లైంట్ (రాహుల్) కు తెలుసా? ఆ ఫ్రీడం ఫైటర్ కు రాహుల్ నాయనమ్మ ఇందిరా గాంధీ లేఖ కూడా రాశారు. ఆ విషయమైనా తెలుసా?” అని బెంచ్ ప్రశ్నిచింది. రాహుల్ ఒక రాజకీయ నాయకుడని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. స్టే విధించాలన్న రాహుల్ విజ్ఞప్తికి బెంచ్ అంగీకరించింది.