
- రాష్ట్ర సర్కారు, అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘంతో పాటు ప్రతివాదులకూ జారీ
- ఈ నెల 22 లోపు రిప్లై ఇవ్వాలని ఆదేశం
- ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అనే తీరు సరికాదని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను రాష్ట్ర హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ద్వారా స్పీకర్ కు అందజేయాలని ఆదేశించింది. అలాగే, శాసనసభ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. మార్చి 22 లోపు ఈ నోటీసులపై కౌంటర్ దాఖలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
తదుపరి విచారణను మార్చి 25 కు వాయిదా వేసింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీపై కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జ్ మాసిస్ల బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ అర్యమ సుందరం, నాయుడు, మోహిత్ రావు.., స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మనుసింఘ్వి, ముకుల్ రోహిత్గి హాజరయ్యారు. తొలుత అర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. ఏడాది పూర్తికావొస్తున్నా ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని బెంచ్ దృష్టికి తెచ్చారు. తమ ఫిర్యాదుల తర్వాత స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చినట్టు చెబుతోందన్నారు.
రాజకీయ అంశాలు పూర్తిగా వేరని.. అయితే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్లే అని వాదనలు కొనసాగించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ బెంచ్ ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలని నాలుగు వారాలు టైం ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్ కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్ పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టినట్లు వివరించారు. కానీ, ఇప్పటి వరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
నోటీసులు అందలే..
పిటిషనర్ల తరఫు అడ్వకేట్ వాదనలపై స్పీకర్ సెక్రటరీ తరఫు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింఘ్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై గతేడాది జులై మొదటి వారంలో స్పీకర్ కు కంప్లైంట్ చేస్తే.. 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారన్నారు. ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారని, నోటీసులు ఇచ్చారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి రిప్లయ్ రాగానే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదన్నారు. రాజ్యాంగబద్ధ ఉన్నత పదవులలో స్పీకర్ పదవి ఒకటి, ఆ పదవిలో ఉన్న స్పీకర్ కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదని నొక్కి చెప్పారు. అలాగే, గత విచారణ సందర్భంగా ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పటికీ.. ఇందుకు సంబంధించి తమకు ఏ విధమైన నోటీసులు అందలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వాదనలపై మరోసారి స్పందించిన జస్టిస్ గవాయ్.. ‘తగినంత సమయం అంటే ఎంత? వాయిదా వేస్తూ ఐదేండ్ల పదవి పూర్తయ్యే వరకు ఉంటారా? తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా? మనం ప్రజా స్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది. ఆపరేషన్ సక్సెస్, పెషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదు’అని కీలక కామెంట్లు చేశారు. ప్రస్తుతం నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్ తో పాటు, శాసనసభ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రతివాదులకు నోటీసులు ఇస్తున్నట్లు వెల్లడించారు.