కేసుల సత్వర పరిష్కారం కోసం మధ్యవర్తిత్వమే శ్రేయస్కారం : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ్మా

కేసుల సత్వర పరిష్కారం కోసం మధ్యవర్తిత్వమే శ్రేయస్కారమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ్మా తెలిపారు. శనివారం (డిసెంబర్ 23న) సిటి సివిల్ కోర్టు ఆవరణలో సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎంఎల్ రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైట్ ఆఫ్ మిడియేషన్ 2020 సదస్సును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్‌ అరాధే, సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుఖయాతో కలిసి ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయయూర్తి నర్సింహ్మా మాట్లాడారు. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కే కక్షిదారులు.. ఏ విషయంలో న్యాయ సహాయం కోసం వస్తున్నారో కేసు పరిశీలిస్తున్న న్యాయమూర్తులు ఒకసారి పరిశీలించాలన్నారు. కేసు విషయంలో లోతైన విషయాలను గుర్తించాలని, అప్పుడే న్యాయం కోసం కోర్టుకు వచ్చే వారికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కేసుల్లోనూ ఆ సాంకేతికతను వినియోగించుకుంటూ సాక్ష్యాలను సేకరిస్తూ తగిన న్యాయం అందించాలని సూచించారు.