
న్యూఢిల్లీ: మరింత పారదర్శకత కోసం మొత్తం 30 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తులను ప్రకటించనున్నారు. తమ ఆస్తుల వివరాలు వారు సుప్రీం కోర్టు వెబ్సైట్లో బహిరంగ పరచనున్నారు. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది భవిష్యత్తులో బాధ్యతలు చేపట్టబోయే సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు కూడా వర్తించనుంది.
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అయితే అధికారిక తీర్మానం ఇంకా వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. జడ్జిలు తమ ఆస్తులను సీజేఐకి వెల్లడించే నిబంధన ఇప్పటికే ఉన్నా, వాటిని పబ్లిక్ డోమైన్లో బహిర్గతం చేసేవారు కాదు. 2009 కోర్టు వెబ్సైట్లో స్వచ్ఛందంగా ప్రకటించే ఆవకాశం కూడా సుప్రీం కోర్టు ఇచ్చింది.
అయితే చాలా మంది జడ్జిలు తమ ఆస్తులను ప్రకటించాడన్ని ఒక ఆప్షన్‌గా మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు సుప్రీం ఫుల్‌కోర్టు తీర్మానంతో ప్రతి జడ్జీ తమ ఆస్తులను ప్రకటించడం ఇక తప్పనిసరి కానుంది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి ఇప్పటికే తమ ఆస్తుల ప్రకటనలు సమర్పించారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో వాటిని అప్లోడ్ కూడా చేయనున్నారు. అయితే ఆస్తుప్రకటనకు నిర్దిష్ట పద్ధతులు, నిర్ణీత సమయం ఖరారు చేయనున్నట్టు సమాచారం.