
న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని, వాటిని ఎలా పునరుద్దరణ చేస్తారనే ప్రణాళికతో రావాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ లేదని, చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో, లేదో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని జస్టిస్ బీఆర్ గవాయ్ సూటిగా ప్రశ్నించారు.1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ అడిగారు.
100 ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పండని జస్టిస్ గవాయ్ అడగగా.. అందుకు అభిషేక్ మను సింఘ్వి సమాధానం ఇచ్చారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. చెట్లను పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారు, జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ నివేదికపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు ధర్మాసనం సమయం ఇచ్చింది. తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసింది. అప్పటి వరకు సుప్రీం కోర్టు స్టేటస్ కో విధించింది.