హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం లైన్‌ క్లియర్‌

 హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం లైన్‌ క్లియర్‌

న్యూఢిల్లీ :  హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ) ఎన్నికలకు కీలక ముందడుగు పడింది. హెచ్‌‌‌‌సీఏ పర్యవేక్షణ, ఆఫీస్‌‌‌‌ బేరర్ల ఎన్నికల నిర్వహణకు తామునియమించిన  మాజీ జడ్జి, జస్టిస్​ లావు నాగేశ్వర రావు ఏకసభ్య కమిటీ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని  తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టులను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. 

 

ఈ విషయంలో ఆయా కోర్టులు ఇచ్చే ఆదేశాలు చెల్లబోవని స్పష్టం చేసింది. హెచ్‌‌‌‌సీఏను గాడిలో పెట్టి సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏకసభ్య కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని బహుళ క్లబ్‌‌‌‌లపై వేటు వేసి,  ఓటు హక్కు తొలగించింది. ఈ నిర్ణయాలపై పలు క్లబ్‌‌‌‌లు జిల్లా కోర్టులను, హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హెచ్‌‌‌‌సీఏ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదు. 

ALSO READ: మంత్రాలు చేస్తున్నారని చెట్టుకు కట్టేసిన్రు

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్‌‌‌‌ నాగేశ్వర రావు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియలతో కూడిన సుప్రీంకోర్ట్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది. ఈ విషయంలో దిగువ న్యాయస్థానాలు కల్పించుకోవద్దని స్పష్టం చేసిన బెంచ్‌‌‌‌ ఏదైనా ఫిర్యాదు ఉంటే సుప్రీంకోర్టు దృష్టికే తీసుకురావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌‌‌‌ 31వ తేదీకి వాయిదా వేసింది.