న్యూఢిల్లీ: మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడటం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. క్రైస్తవ మతానికి చెందిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు అనుమతించదని జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్ వెల్లడించింది. ఇలా చేయడం కోటా విధానం ప్రాథమిక, సామాజిక లక్ష్యాలను బలహీనపరిచినట్టే అవుతుందని తెలిపింది.
హిందూ తండ్రికి, క్రైస్తవ తల్లికి పుట్టిన సెల్వరాణి అనే ఓ మహిళ క్రైస్తవురాలిగా బాప్టిజం తీసుకుంది. ఆ తర్వాత తనకు తాను హిందువుగా ప్రకటించుకుంది. పుదుచ్చేరిలో 2015లో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని, అందుకే ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమెకు కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం మాత్రం మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది.