బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీం నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీం నోటీసులు
  • ఎన్నికల అఫిడవిట్​లో ఐటీ 
  • రిటర్న్స్ పేర్కొనలేదని కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ పిటిషన్​

న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో పలు అంశాలను దాచిపెట్టారని దాఖలైన పిటిషన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో ఆదాయానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ను ఆమె పొందుపరచలేదని ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన కోర్టు.. అజ్మీరా శ్యామ్ పిటిషన్ ను కొట్టివేసింది.

 ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన నవంబర్​ 21న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. అఫిడవిట్ లో కోవ లక్ష్మి ఐటీ రిటర్న్స్, ఇతర అంశాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. 

ఎన్నికల నియమావళి ప్రకారం ఆమె ఎన్నిక చెల్లదని వాదించారు. కోవ లక్ష్మి తరఫున అడ్వకేట్ మోహిత్ రావు వాదిస్తూ.. తాజా ఐటీ రిటర్న్స్ తో పాటు, ఆమెకు వచ్చే జీతం, ఇతర ఆర్థిక అంశాలను అఫిడవిట్ లో పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎమ్మెల్యే కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ జనవరి 30న మరోసారి బెంచ్ ముందుకు రానుంది. కాగా, కోవ లక్ష్మి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 22,798 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ పై గెలుపొందారు. లక్ష్మికి 83, 036 ఓట్లు రాగా.. 60, 238 ఓట్లు అజ్మీరా శ్యామ్ కు వచ్చాయి.