న్యూఢిల్లీ: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూముల కేటాయింపుల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందజేసింది. రంగారెడ్డి కలెక్టర్‌తో పాటు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్‌కు చెందిన మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 2010లో అప్పటి ప్రభుత్వం విలువైన భూములను కేటాయించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం నెక్నాంపూర్లో 55 ఎకరాలు, శామీర్ పేట మండలం జవహర్‌నగర్‌లో 100 ఎకరాలు ఇచ్చింది. జీవో 509, 510లను జారీ చేసింది. ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ ఓమిమ్ దేబర, మరొకరు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయగా తుది తీర్పు వెలువడింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఓమిమ్ దేబర సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర దత్తాతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా భూములను కేటాయించారని తెలిపారు. కేటాయింపులు జరిపే నాటికి భూముల విలువ రూ.525 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. కానీ, ఎకరాకు రూ.2 లక్షల చొప్పున మొత్తంగా రూ.3.110 కోట్లకు ప్రభుత్వం ఈ భూములు కట్టబెట్టిందని వెల్లడించారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు బీపీఎల్ కిందకు రారని వాదించారు.