న్యూఢిల్లీ, వెలుగు: జీవో 46పై తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జీవోపై రాష్ట్ర సర్కార్ తమ వైఖరిని వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చేపట్టిన నియామకాల్లో జీవో నంబర్ 46ను మినహాయించాలని కోరుతూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అభ్యర్థులకు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ.. అక్టోబర్ 19న మాటూరి శ్రీకాంత్, గోగుల సందీప్, రూపావత్ శంకర్, రామావత్ అజయ్, బొమ్ము ఆంజనేయులు సహా మరికొంత మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌ల బెంచ్ విచారణ జరిపింది.
తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో జీవో 46తో పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హులైన తమ లాంటి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బెంచ్‌కు నివేదించారు. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు తమ వాదనలపై పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్ల సుప్రీంకోర్టులో తుదితీర్పు వెలువడే వరకు పోలీసు నియామక ప్రక్రియకు సంబంధించిన తదుపరి కార్యాచరణను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని తెలుపుతూ సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే 27కు వాయిదా వేసింది.