NEET PG 2024: రీషెడ్యూల్ చేయలేం.. నీట్ పీజీ 2024 పరీక్షపై సుప్రీం కోర్టు

ఢిల్లీ: నీట్ పీజీ 2024 విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నీట్ పీజీ 2024 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో నేతృత్వంలోని అపెక్స్ కోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేయలేమని.. రెండు లక్షల మంది విద్యార్థులు, నాలుగు లక్షల మంది తల్లిదండ్రులపై ప్రభావం పడుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఐదుగురు పిటిషన్లర కోసం రెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను రిస్క్లో ఉంచలేమని ధర్మాసనం తెలిపింది.

నీట్ 2024 పరీక్షా కేంద్రాలు సుదూరంగా ఉన్నాయని, పరీక్షకు హాజరవడానికి అసౌకర్యంగా ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు.185 టెస్ట్ సెంటర్లను ప్రకటించారని, ట్రైన్ టికెట్లు దొరక్క, విమాన టికెట్ల ధరల పెంపు కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందిపడే పరిస్థితి ఉందనేది పిటిషనర్ తరపు వాదన. నీట్ పీజీ 2024 పరీక్ష ఆగస్ట్ 11న జరగనుంది. రెండు షిఫ్టులలో జరుగుతుంది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీక్, పోటీ పరీక్షలల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్)  జూన్ 23న  జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు 52 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల కోసం ప్రతి ఏడాది దాదాపు రెండు లక్షల మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు నీట్ పరీక్ష రాస్తుంటారు.